కోహ్లిని వెనక్కి నెట్టి ధవన్‌ టాప్‌లోకి.. 

11 Apr, 2021 15:38 IST|Sakshi
శిఖర్‌ ధవన్‌(బీసీసీఐ/ పీటీఐ)

ముంబై:  ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ధవన్‌ తొలి స్థానాన్ని ఆక్రమించాడు. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కే నిర్దేశించిన 189 పరుగులు టార్గెట్‌ను ఢిల్లీ 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలోనే ధవన్‌ 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో  85 పరుగులు సాధించాడు.

ఫలితంగా సీఎస్‌కేపై 910 పరుగుల్ని ఖాతాలో వేసుకున్నాడు.  అదే సమయంలో సీఎస్‌కేపై అత్యధిక పరుగుల్ని సాధించి ఇప్పటివరకూ  ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(901) రికార్డును అధిగమించాడు. సీఎస్‌కేపై అత్యధిక పరుగులు సాధించిన వారిలో ధవన్‌, కోహ్లిలు తొలి రెండు స్థానాల్లో ఉండగా, రోహిత్‌ శర్మ(749) మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్‌ వార్నర్‌(617) నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, ఏబీ డివిలియర్స్‌(593) ఐదో స్థానంలో, రాబిన్‌ ఊతప్ప(590) ఆరో స్థానంలో ఉన్నారు. 

వార్నర్‌ను దాటేశాడు..
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ధవన్‌ మూడో స్థానాన్ని ఆక్రమించాడు.  ఈ క్రమంలోనే డేవిడ్‌ వార్నర్‌ను దాటేశాడు ధవన్‌.  ఇప్పటివరకూ ధవన్‌ 5282 ఐపీఎల్‌ పరుగులతో మూడో స్థానానికి ఎగబాకగా, ఆ స్థానంలో ఉన్న డేవిడ్‌ వార్నర్‌(5254)ను వెనక్కి నెట్టాడు.  కాగా, ధవన్‌ 177 ఐపీఎల్‌ మ్యాచ్‌లుగ ఆడగా, వార్నర్‌  142 మ్యాచ్‌లు ఆడాడు. నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.

ఒకవైపు భారీ లక్ష్యమే ఉన్నప్పటికీ దాన్ని సునాయాసంగా ఛేదించింది.  ఓపెనర్‌ ధవన్‌కు తోడు పృథ్వీ షా(72) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ అవలీలగా గెలుపును సాధించింది.  ముందుగా సీఎస్‌కే బ్యాటింగ్‌ చేయగా 188 పరుగులు చేసింది. రైనా(54), మొయిన్‌ అలీ(36),  సామ్‌ కరాన్‌(34)లు   దాటిగా ఆడగా, రాయుడు(23), రవీంద్ర జడేజా(26 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. 

ఇక్కడ చదవండి: ఒకవైపు ఓటమి.. మరొకవైపు ధోనికి భారీ జరిమానా

‘అది మాకు సానుకూలాంశం..  తక్కువ అంచనా వేయొద్దు’

మరిన్ని వార్తలు