పృథ్వీ షా మెడపట్టి నొక్కి.. శివం మావి స్వీట్‌ రివేంజ్‌!

30 Apr, 2021 12:12 IST|Sakshi
Photo Courtesy: IPL Twitter

అహ్మదాబాద్‌: ఆట ఏదైనా అప్పటివరకు మిత్రులుగా మెలిగిన ఆటగాళ్లు మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులుగా మారిపోతారు. ‘నువ్వా- నేనా’ అంటూ పోటీపడుతూ తమ జట్టును గెలిపించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే, ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిందంటే చాలు మళ్లీ ఫ్రెండ్స్‌లా మారిపోయి, మునుపటిలాగే సరదాగా గడిపేస్తారు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే తరహా సీన్‌ రిపీట్‌ అయ్యింది. మ్యాచ్‌ పూర్తవ్వగానే పృథ్వీ షా- శివం మావి ఆత్మీయంగా పలకరించుకున్న తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గురువారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ బౌలర్‌ శివం మావి వేసిన తొలి ఓవర్‌లోనే వరుసగా ఆరు బౌండరీలు బాది అతడికి చుక్కలు చూపించాడు. ఇక మ్యాచ్‌లో 41 బంతుల్లో 82 పరుగులు చేసిన షా అద్భుతమైన స్ట్రైక్‌రేటు నమోదు చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. షా సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ మెరుగైన స్కోరు నమోదు చేసి, కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే, పూనకం వచ్చినట్లుగా షా మొదటి ఓవర్‌లోనే వరుసగా ఫోర్లు బాదడంతో తలపట్టుకున్న శివం మావి, మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాత్రం అతడిపై స్వీట్‌గా రివేంజ్‌ తీర్చుకున్నాడు. శభాష్‌ అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూనే.. ‘‘నా బౌలింగ్‌లోనే విధ్వంసం సృష్టిస్తావా’’ అన్నట్లుగా.. పృథ్వీ షా మెడను, చేతిని నొక్కిపట్టాడు. ఇక శివం ఇలా చేయగానే, ఇక నొప్పి భరించలేను అన్నట్లుగా పృథ్వి అతడిని విడిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘ఒక్కసారి మ్యాచ్‌ అయిపోయిందంటే.. స్నేహమే దాని తాలుకూ ఫలితాలను ఆక్రమించేస్తుంది. ఐపీఎల్‌లో ఉన్న బ్యూటీ అదే’’ అని కామెంట్‌ జతచేసింది.

చదవండి: దురదృష్టంకొద్దీ మావి అలా వేయలేదు: పృథ్వీ షా

మరిన్ని వార్తలు