మీకెంత ధైర్యం.. మమ్మల్ని వదిలేస్తారా?

3 May, 2021 18:01 IST|Sakshi
Photo Courtesy: ICC

ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌పై స్లేటర్‌ ధ్వజం

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-14 సీజన్‌కు వచ్చిన ఆసీస్‌ క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామని ప్రయత్నాలకు విమానాల నిషేధం రూపంలో అడ్డుతగిలింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌.. భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఐపీఎల్‌లో చిక్కుకుపోయిన ఆ దేశ క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ప్రతీ ఒక్కర్నీ తమ తమ దేశాలకు పంపుతామని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) హామీ ఇచ్చినా అప్పుడుదాకా ఉండటం వారికి కష్టంగా పరిగణించింది.

కొన్ని రోజుల క్రితం స్వదేశానికి రావడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం చార్టెడ్‌ విమానాలు వేయాలని క్రిస్‌ లిన్‌ కోరగా దాన్ని పీఎం మోరిసన్‌ తిరస్కరించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక విమానాలు వేయమని, మీరే సొంత ఖర్చులు పెట్టుకుని రావాలని కరాఖండిగా చెప్పేశారు. దీనిపై తాజాగా ఆసీస్‌ మాజీ క్రికెటర్‌, ప్రముఖ  కామెంటేటర్‌ మైకేల్‌ స్లేటర్‌ ధ్వజమెత్తాడు. ఇలా మీ దేశ పౌరుల్ని వదిలేస్తారా.. మీకెంత ధైర్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈమేరకు ట్వీటర్‌ ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఐపీఎల్‌ బయోబబుల్‌ను వీడి మాల్దీవులకు చెక్కేసిన స్లేటర్‌.. ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడానికి యత్నాలు చేస్తున్నాడు.

దీనిలో భాగంగా తమ ప్రధాని మోరిసన్‌ కామెంట్లపై విరుచుకుపడ్డాడు స్లేటర్‌. ‘ మీరు మమ్మల్ని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టకపోతే అంతకంటే దారుణం ఇంకొటి ఉండదు. మాకు ఏది జరిగినా దానికి మీరే కారణం అవుతారు. మమ్మల్ని చిన్నచూపు  చూడటానికి మీకెంత ధైర్యం. క్వారంటైన్‌ సిస్టమ్‌ను ఎలా పరిష్కరిస్తారు. నేను గవర్నమెంట్‌ అనుమతితోనే ఐపీఎల్‌లో పని చేయడానికి ఇక్కడికి వచ్చా. కానీ గవర్నమెంట్‌ నిర్లక్ష్యానికి గురవుతున్నా’ అంటూ ట్వీటర్‌ వేదికగా స్లేటర్‌ మండిపడ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌ హ్యాక్లీ కూడా ఐపీఎల్‌లో ఉన్న తమ దేశ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించడానికి బోర్డు ఎటువంటి చార్టర్‌ విమానాలను వేయడం లేదని తాజాగా స్పష్టం చేసిన క్రమంలో స్లేటర్‌కు చిర్రుత్తుకొచ్చింది. అసలు ఆస్ట్రేలియా పౌరుల్లాగా తమను చూడకపోవడం చాలా దారుణమన్నాడు. 

ఇక్కడ చదవండి: మాల్దీవులకు పారిపోయిన కామెంటేటర్‌
సీఎస్‌కే క్యాంప్‌లోనూ కరోనా కలకలం..!

మరిన్ని వార్తలు