బయోబబుల్‌లో ఉన్నా ఆటగాళ్లకి ఎలా సోకిందో చెప్పడం కష్టం

6 May, 2021 14:09 IST|Sakshi

ముంబై: బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘బోర్డు ఈ సంవత్సరం లీగ్‌ను జరపాలని భావించిన సమయంలో దేశంలో కొన్ని కేసులు మాత్రమే ఉండడం, పరిస్థితి కూడా అదుపులోనే ఉన్నట్లు కనిపించింది. అందుకే మ్యాచ్‌లను వివిధ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. కానీ కరోనా పరీక్షల్లో నలుగురు ఆటగాళ్లకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఐపీఎల్ 14 వ ఎడిషన్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని బోర్డు మంగళవారం నిర్ణయించింది’’ అని తెలిపారు.

నివేదిక ప్రకారం బయోబబుల్‌ ఉల్లంఘన లేదు
ఆటగాళ్లకు పాజిటివ్‌  రావడంపై స్పందిస్తూ.. ‘‘బయోబబుల్‌లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని మాకు నివేదిక అందింది. అయినా  ఆటగాళ్లకు పాజిటివ్‌ ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. బీసీసీఐ ఇంత పక్కాగా చర్యలు చేపట్టినా ఆటగాళ్లకు ఎలా వైరస్‌ సోకిందని చెప్పడం కూడా కష్టమే’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అమిత్ మిశ్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వృద్ధిమాన్ సాహాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ తర్వాత ఈ వాయిదా ప్రకటన వచ్చింది. అహ్మదాబాద్‌లో మే 30 వరకు జరగాల్సిన 60 మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. తాజాగా ఐపీఎల్ రద్దు కాలేదని, వాయిదా మాత్రమే వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దీనిపై మంగళవారం స్పష్టం చేశారు. 

( చదవండి: IPL 2021: ఐపీఎల్‌ రీషెడ్యూల్‌.. బీసీసీఐ ఆప్షన్లు ఇవే..! )

మరిన్ని వార్తలు