ఏబీడీ అరుదైన ఘనత; నా ఐడల్‌ అన్న వార్నర్‌!

28 Apr, 2021 12:07 IST|Sakshi
Photo Courtesy: IPL Twitter

అహ్మదాబాద్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పరుగుల సునామీ సృష్టించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. ‘‘ఇది కేవలం సూపర్‌మేన్‌కే సాధ్యం.. మామూలు మనుషులు అయితే ఇలా ఆడలేరు’’ అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 (42 బంతులు, నాటౌట్‌) పరుగులు చేసిన విషయం తెలిసిందే. 

ఇక ఏబీ సూపర్‌ ఇన్నింగ్స్‌ కారణంగా, మెరుగైన స్కోరు నమోదు చేసిన కోహ్లి సేన, ఆఖరికి ఒకే ఒక్క పరుగుతో ఢిల్లీపై విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన ఏబీ డివిలియర్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మార్కును చేరుకున్న రెండో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. 161 ఇన్నింగ్స్‌లో ఏబీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఏబీ కంటే ముందు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘మిస్టర్‌ 360.. 5 వేల పరుగులు’’ అంటూ ఐపీఎల్‌ ట్విటర్‌ వేదికగా అతడిని అభినందించింది. ఇందుకు స్పందించిన వార్నర్‌.. ‘ ఏబీ డివిలియర్స్‌.. లెజెండ్‌, నా ఐడల్‌’’ అంటూ అతడిపై అభిమానం చాటుకున్నాడు.

స్కోర్లు: ఆర్సీబీ: 171/5 (20)
ఢిల్లీ క్యాపిటల్స్‌: 170/4 (20)

చదవండి: IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది
ఏబీ.. నీకు హ్యాట్సాఫ్‌: కోహ్లి

మరిన్ని వార్తలు