ఆ జట్టు‌కు గెలిచే అర్హతే లేదు: మంజ్రేకర్‌

18 Apr, 2021 17:04 IST|Sakshi

చెన్నై: ముంబైతో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ తుది జట్టు ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తుది జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు(అభిషేక్‌ శర్మ, విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌) ఒకేసారి అవకాశం కల్పించడంపై జట్టు యాజమాన్యానికి చురకలంటించాడు. ప్రత్యర్ధిని తక్కువ స్కోర్‌కే(150 పరుగులు) కట్టడి చేయగలిగినా బలహీనమైన మిడిలార్డర్‌ కారణంగా మ్యాచ్‌ చేజార్చుకున్న వైనంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అసలు సన్‌రైజర్స్‌కు గెలిచే అర్హతే లేదని మండిపడ్డాడు. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వార్నర్‌(34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో(22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) శుభారంభాన్ని అందించినా సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ధ్వజమెత్తాడు.

కొత్త కుర్రాళ్లు విరాట్‌ సింగ్‌(12 బంతుల్లో 11; ఫోర్‌), అభిషేక్‌ శర్మ(4 బంతుల్లో 2), అబ్దుల్‌ సమద్‌(8 బంతుల్లో 7; ఫోర్‌) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాని ప్రభావం జట్టుపై పడందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ముంబైతో మ్యాచ్‌ను చేజార్చుకోవడానికి ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యమే ప్రధాన కారణమని, తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేకపోతే ఆ జట్టు బోణీ కొట్టడానికి కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. 2016 సీజన్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. 3 మ్యాచ్‌ల తర్వాత కూడా గెలుపు పట్టాలెక్కలేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే నిన్న చెన్నై వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముంబై నిర్ధేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ 19.4 ఓవర్లలో 137 పరగులకే చాపచుట్టేసింది. ఓపెనర్లు వార్నర్‌(36), బెయిర్‌స్టో(43), విరాట్‌ సింగ్‌(11), విజయ్‌ శంకర్‌(28) మినహా మిగిలిన ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌ను కూడా చేరుకోలేకపోయారు. కాగా, ఎస్‌ఆర్‌హెచ్‌ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లో ఓటమిపాలవ్వగా, తొలి మ్యాచ్‌లో తగిలిన ఎదరుదెబ్బ నుంచి కోలుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 
చదవండి: ఆ కారణంగానే విలియమ్సన్‌ను ఆడించట్లేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్‌‌

మరిన్ని వార్తలు