వైరల్‌: డ్రింక్స్‌ మోసుకెళ్లినా.. వి లవ్‌ యూ వార్నర్‌ అన్నా!

4 May, 2021 12:35 IST|Sakshi
Photo Source: IPL, Twitter

న్యూఢిల్లీ: డేవిడ్‌ వార్నర్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ కప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌. 2016లో అతడి సారథ్యంలోని జట్టు ఆర్సీబీపై గెలుపొంది తొలి టైటిల్‌ నెగ్గింది. కెప్టెన్‌గానే కాదు, బ్యాట్స్‌మెన్‌గా కూడా వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఇక కేవలం ఆటకే పరిమితం కాకుండా, లాక్‌డౌన్‌ కాలంలో టాలీవుడ్‌ పాటలకు స్టెప్పులేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు ఈ ఆసీస్‌ క్రికెటర్‌. ఇలా ఆటపాటలతో హైదరాబాదీల మనసు దోచుకుని, వార్నర్‌ అన్నగా అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న  డేవిడ్‌కు సన్‌రైజర్స్‌ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌-2021 సీజన్‌లో హైదరాబాద్‌ వరుస వైఫల్యాల నేపథ్యంలో తనను కెప్టెన్సీ నుంచి తొలగించడమే గాకుండా, ఆదివారం నాటి మ్యాచ్‌లో తుదిజట్టులో కూడా స్థానం కల్పించలేదు. దీంతో, 12వ ఆటగాడిగా డ్రింక్స్‌  మోయడానికే పరిమితమయ్యాడు వార్నర్‌. అయినప్పటికీ, అతడిలో ఏ మాత్రం అసహనం, కోపం కనిపించలేదు. తన అవసరం ఉందనిపించినప్పుడల్లా కెప్టెన్‌ విలియమ్సన్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. బెంచ్‌ మీద కూర్చోవాల్సి వచ్చినా ‘తన’ జట్టుకు పూర్తి మద్దతుగా నిలిచాడు. మ్యాచ్‌ ఆసాంతం ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో వార్నర్‌ సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

డగౌట్‌లో ఉన్న వార్నర్‌.. సహచరులకు డ్రింక్స్‌ మోసుకువెళ్లే విషయంలో ఇతరులతో పోటీ పడుతూ పరుగులు పెట్టాడు. తానే ముందు డ్రింక్స్‌ తీసుకువెళ్లాలన్నట్లుగా సరదా ఫైట్‌కి దిగాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే. అందుకే వార్నర్‌ భాయ్‌ నువ్వంటే మాకు అంత ఇష్టం. నువ్వు తుదిజట్టులో లేకపోతే మ్యాచ్‌ చూడాలనే అనిపించదు. లవ్‌ యూ అన్నా. నువ్వు ఎక్కడ ఉన్నా రాజువే. మరోసారి మా మనసులు గెల్చుకున్నావ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 55 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గలేక.. ఈ సీజన్‌లో ఆరో ఓటమిని నమోదు చేసింది. 

చదవండి: ‘వార్నర్‌ను సన్‌రైజర్స్‌ జెర్సీలో చూడటం ఇదే ఆఖరు

>
మరిన్ని వార్తలు