‘అది మాకు సానుకూలాంశం.. తక్కువ అంచనా వేయొద్దు’

11 Apr, 2021 14:40 IST|Sakshi
సీఎస్‌కే జట్టు(ఫైల్‌ఫోటో)

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలుకావడం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 188 పరుగుల భారీ స్కోరు చేసినా పరాజయం చెందింది. ఢిల్లీ క్యాపిటల్స్‌  ఆది నుంచి దూకుడుగా ఆడటంతో ఆ టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. దీనిపై మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే కోచ్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ..  తాము తిరిగి గాడిలో పడటానికి ఎంత సమయం పట్టదని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. తమ జట్టు బౌలింగ్‌లో చేసిన తప్పిదాలతోనే ఓటమి పాలైందని, వాటిని సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌ల్లో సత్తాచాటుతామన్నాడు.

గతంలో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని,  ముంబైలో తాము ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు.  తాము ముంబైలోని వాంఖడేలో పరిస్థితుల్ని సాధ్యమైనంత త్వరగా అర్థం చేసుకుంటామన్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గాడిలో పడతామన్నాడు.  తమది చెన్నైకి చెందిన జట్టని, తమను తక్కువ అంచనా వేయవద్దని పరోక్షంగా ప్రత్యర్థి జట్లకు వార్నింగ్‌ ఇచ్చాడు.  ప్రధానంగా ముంబైలోని పిచ్‌ పరిస్థితుల్ని బట్టి చూస్తే బౌలింగ్‌లో తాము ఇంకా మెరుగుపడాలన్నాడు. 

అది మాకు సానుకూలాంశం
గత సీజన్‌కు దూరమై ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన సురేశ్‌ రైనాపై ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో సురేశ్‌ రైనా కొట్టిన షాట్లు అతని మునపటి ఫామ్‌ను గుర్తుకు తెచ్చాయన్నాడు.  మొయిన్‌ అలీని దూకుడుగా ఆడటానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే, రైనా కూడా అదే రోల్‌ను పోషించడం తమకు సానుకూలాంశమని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. రైనా రెండు-మూడు షాట్లు కొట్టిన తర్వాత ఫుల్‌ జోష్‌లోకి వచ్చాడన్నాడు. ఈ సీజన్‌లో సురేశ్‌ రైనా పాత్ర తమకు కచ్చితంగా లాభిస్తుందని ఫ్లెమింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో తమ ప్రణాళికలు అంతగా ఉపయోగపడలేదని, వచ్చే మ్యాచ్‌ల్లో దాన్ని కూడా అధిగమిస్తామన్నాడు.

మరిన్ని వార్తలు