బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కాస్త ముందు వస్తే బాగుండేది

11 Apr, 2021 16:24 IST|Sakshi

ముంబై: శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఓవరాల్‌గా ఐపీఎల్‌లో నాలుగు డకౌట్లతో ధోని చెత్త రికార్డును నమోదు చేశాడు. అంతేగాక ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ధోని డకౌట్‌ అవ్వడం ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. అయితే ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చుకుంటే బాగుంటుందని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ సలహా ఇచ్చాడు.

మ్యాచ్‌ అనంతరం గావస్కర్‌ మాట్లాడుతూ.. ''ధోని ఒకసారి తన బ్యాటింగ్‌ స్థానంపై పునరాలోచించుకోవాలి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చాడు. అప్పటికి జట్టుకు ఐదు నుంచి ఆరు ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఒక ఆటగాడు భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన చోట ధోని మాత్రం కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. అతని తర్వాత వచ్చిన సామ్‌ కరన్‌ మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.నా ఉద్దేశంలో సామ్‌ కరన్‌ను మూడు లేదా నాలుగో స్థానంలో పంపించి.. ధోని ఐదు లేదా ఆరో స్థానంలో వచ్చి ఉంటే బాగుండేది. స్ట్రైక్‌ రొటేట్‌ చేయకుండా నిలబడాలని ధోని భావిస్తే మాత్రం రానున్న మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌పై దృష్టి సారిస్తే బాగుంటుంది. అని చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా 54, అలీ 36, సామ్‌ కరన్‌ 34 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు ధావన్‌ 85, పృథ్వీ షా 72 పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని నమోదు చేసింది.
చదవండి: ఒకవైపు ఓటమి.. మరొకవైపు ధోనికి భారీ జరిమానా

సీఎస్‌కే మరో 189.. టాప్‌-5లోకి!

>
మరిన్ని వార్తలు