చెపాక్‌లో ఛేజింగ్‌.. సన్‌రైజర్స్‌లో షివరింగ్!‌

18 Apr, 2021 00:27 IST|Sakshi
Photo Courtesy : ipl website

చెన్నై: ఐపీఎల్ 2021‌ సీజన్‌ ప్రారంభమై వారంపైనే గడుస్తున్నా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంకా ఖాతా తెరవలేదు. వరుసగా మూడు ఓటములతో హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇది ముంబైకి రెండో విజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన లక్ష్యం 151.  ఇది ఈ పిచ్‌పై అంత ఈజీ కాదని సన్‌రైజర్స్‌ ఆటగాళ్లకు తెలుసు. టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌ చేద్దామని ఆరెంజ్‌ ఆర్మీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ భావించినా అది జరగలేదు.


Photo Courtesy : ipl website

టాస్‌ రోహిత్‌ శర్మ గెలవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం సన్‌రైజర్స్‌ కు రాలేదు. టాస్‌ ఓడిపోయినప్పుడే వార్నర్‌.. టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ చేసేవాళ్లమని చెప్పడాన్ని బట్టి చూస్తే సన్‌రైజర్స్‌ కు ఇక్కడ ఛేజింగ్‌ ఫియర్‌ ఎంతలా పట్టుకుందో అర్థమవుతోంది. గత మ్యాచ్‌ల్లో ఫలితాల్ని చూస్తే ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టే అత్యధిక విజయాలు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌తో కలుపుకుని నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుపును అందుకున్నాయి. 


Photo Courtesy : ipl website

ఇక్కడ పిచ్‌ ఛేజింగ్‌కు అస్సలు అనుకూలించడం లేదు. బంతి బ్యాట్‌పైకి సరిగా రాకపోవడం ఒకటైతే,. బంతి పాతబడే కొద్దీ ఇంకా ప్రమాదకరంగా మారుతోంది. టాస్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని, పిచ్‌ ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని కారణంగా ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లడమే సబబు అనిపించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నాడు.


Photo Courtesy : ipl website

కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆరంభం అదిరింది. డీకాక్‌, రోహిత్‌ శర్మలు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. వీరిద్దరూ పవర్‌ ప్లేలో సాద్యమైనన్ని పరుగులు సాధించాలనే తలంపుతో బ్యాటింగ్‌ చేశారు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అటు తర్వాత ముంబై ఇండియన్స్‌లో జోరు తగ్గింది. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. అంటే మిగతా పది ఓవర్లలో ముంబై చేసిన పరుగులు 48 పరుగులే.  కానీ చివర్లో పొలార్డ్‌ 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో  35 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ముంబై 150 పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచింది. 


Photo Courtesy : ipl website

సన్‌రైజర్స్‌ పవర్‌ ప్లే జోరు.. చివర్లో బేజారు
పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌‌ దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఇక్కడ ముంబై కంటే నాలుగు పరుగులు అదనంగానే చేసింది ఆరెంజ్‌ ఆర్మీ. కానీ 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఆ రెండు వికెట్లలో ఒకరు బెయిర్‌ స్టో అయితే, మరొకరు మనీష్‌ పాండే. మరో  నాలుగు ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ చేసిన పరుగులు 17. ఇక్కడే ఆ జట్టు‌ ఢీలా పడింది.


Photo Courtesy : ipl website

ఒకవైపు వార్నర్‌ పోరాడాలని నిశ్చయించుకున్నా అతను రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కానీ విజయ్‌ శంకర్‌ ఓ దశలో రెండు సిక్సర్లు కొట్టి ఊపు తేవడంతో సన్‌రైజర్స్‌లో ఆశలు చిగురించాయి. విజయ్‌ శంకర్‌ ఔటైన తర్వాత సన్‌రైజర్స్ మరోసారి‌ ఢీలా పడింది. ఇక తిరిగి కోలుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇంకా రెండు బంతులు ఉండగానే సన్‌రైజర్స్‌ ఆట ముగించి ఓటమి పాలైంది.  ఏది ఏమైనా చెపాక్‌ ఛేజింగ్‌ అంటే సన్‌రైజర్స్‌కు షివరింగ్‌గా మారిపోయింది. సన్‌రైజర్స్‌ ఆడిన గత రెండు మ్యాచ్‌లలో కూడా ఛేజింగ్‌ చేయలేకే ఆరెంజ్‌ ఆర్మీ చతికిలబడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు