IPL 2021 నిరవధిక వాయిదా: బీసీసీఐ

5 May, 2021 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021 సీజన్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్‌-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. 

వాయిదా వేస్తాం
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌-2021)కు కరోనా సెగ తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్‌ బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్‌- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు.

ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి. కాగా ఐపీఎల్‌ వాయిదా పడటంతో క్రికెట్‌ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

బాంబే హైకోర్టులో పిటిషన్
కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఐపీఎల్‌కు కేటాయించిన వనరులను కోవిడ్ రోగులకు ఉపయోగించవచ్చని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు.

రద్దు చేస్తేనే మంచిది..
భారత్‌లో రోజూవారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్‌ నిర్వహణ రద్దు అంశంపై sakshi.com నిర్వహించిన పోల్‌లోనూ ఈ విషయం నిరూపితమైంది. ఐపీఎల్‌ను ఆపేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు.


చదవండి: వైరల్‌: డ్రింక్స్‌ మోసుకెళ్లినా.. వి లవ్‌ యూ వార్నర్‌ అన్నా!

మరిన్ని వార్తలు