గాయాల బారిన ‘సన్‌రైజర్స్‌’

18 Apr, 2021 16:08 IST|Sakshi

చెన్నై:  గత ఐపీఎల్‌ సీజన్‌ గుర్తుందా..  అప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయాలు తీవ్రంగా వేధించాయి.  ఇప్పుడు ఈ సీజన్‌లో అదే రిపీట్ అవుతున్నట్లే కనబడుతోంది. గడిచిన సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ముందు కూడా కేన్‌ విలియమ్సన్‌‌ గాయపడ్డాడు. ప్రస్తుత సీజన్‌లో కూడా గాయంతో విలియమ్సన్‌ తొలి మూడు మ్యాచ్‌లు ఆడలేదు. ఇంకా అతను కోలుకోవడానికి వారం సమయం పడుతోంది.  దాంతో తదుపరి మ్యాచ్‌కు కూడా విలియమ్సన్‌ అందుబాటులో ఉంటాడో లేదో అనుమానం. అదే సమయంలో మోకాలి గాయంతో నటరాజన్‌ మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్‌ ఎందుకు ఆడలేదనే అనుమానం తలెత్తింది. కాగా నటరాజన్‌ మోకాలి గాయంతో మ్యాచ్‌కు దూరమైన విషయాన్ని  ఎస్‌ఆర్‌హెచ్‌ మెంటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు.  నటరాజన్‌ను వేసుకోకుండా ఖలీల్‌ అహ్మద్‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. గాయం కారణంగా ఆ యువ క్రికెటర్‌ను తుది జట్టులోకి తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం అతనికి విశ్రాంతి మాత్రమే ఇచ్చామని, జట్టు నుంచి తీసేయలేదన్నాడు.  ఈ సీజన్‌లో తొలి గేమ్‌ ఆడుతున్న ఖలీల్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. చెన్నై పిచ్‌ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుని విభిన్నకోణాల్లో బౌలింగ్‌ చేయడం బాగుందన్నాడు. ఖలీల్‌ బౌన్స్‌ను పేస్‌ను రాబడుతూ బౌలింగ్‌ చేసిన విధానం నిజంగా అభినందనీయమన్నాడు. 

ఒకవైపు ఓటముల.. మరొకవైపు గాయాలు

2016లో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత నాలుగు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఉంది.  కానీ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంతో విమర్శలు వస్తున్నాయి.  వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌, నటరాజన్‌లు ఆ జట్టుకు ప్రధాన బలంగా కాగా ఖలీల్‌ అహ్మద్,  జేసన్‌ హోల్డర్‌, మహ్మద్‌ నబీలు కూడా చెప్పుకోదగిన ఆటగాళ్లే.  

ఇక్కడ స్వదేశీ బెంచ్‌ కంటే విదేశీ బెంచ్‌పైనే సన్‌రైజర్స్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ తుది జట్టులో ఉండాల్సింది నలుగురు విదేశీ ఆటగాళ్లే. దాంతో మార్పులు చేయడం కష్టమవుతోంది. ఇంకా కేన్‌ విలియమ్సన్‌ రాకుండానే సన్‌రైజర్స్‌ పరిస్థితి డైలమాలో పడింది. సన్‌రైజర్స్‌ తుది జట్టులో బెయిర్‌ స్టో, వార్నర్‌, విలియమ్సన్‌(ఫిట్‌ అయితే)లు కచ్చితంగా ఉండాల్సింది. మరి నాలుగో స్థానంలో రషీద్‌ ఖాన్‌  ఉన్నాడు. దాంతో గతేడాది ఆకట్టుకుని సన్‌రైజర్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హోల్డర్‌ను వేసుకోవడానికి ఉండదు. దాంతో పేస్‌ విభాగం బలహీనపడుతోంది.

ఇప్పుడు నటరాజన్‌ గాయం కావడంతో అతని స్థానంలో స్వదేశీ ఆటగాడికే చోటివ్వాలి.  దాంతో ఖలీల్‌కు చోటు దక్కింది. ఇక్కడ ఖలీల్‌ బౌలింగ్‌ చేయగలడు కానీ ఆల్‌రౌండర్‌ కాదు. ఇదే సమస్య ఇప్పుడు సన్‌రైజర్స్‌ను వేధిస్తోంది. ఒకవైపు వరుసగా హ్యాట్రిక్‌ ఓటములు.. మరొకవైపు గాయాలు ఆరెంజ్‌ ఆర్మీకి మింగుడు పడటం లేదు. ఈ లీగ్‌లో ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ఎవరూ గాయపడకుండా అంతా సవ్యంగా సాగిపోతే ఆ జట్టుకు ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఒకవేళ తొలి మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌, మూడో మ్యాచ్‌కు నటరాజన్‌ గాయపడినట్లు ఎవరికైనా గాయాలైతే మాత్రం అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

>
మరిన్ని వార్తలు