మలాన్‌ నం.1 టీ20 బ్యాట్స్‌మెన్‌ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో పోలికా

23 Apr, 2021 16:54 IST|Sakshi

చెన్నై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీలు గళం విప్పుతున్న వేళ టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆ జట్టు స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను వెనకేసుకొచ్చాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న గేల్‌.. ఈ సీజన్‌ మొదటి మ్యాచ్‌లో(రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 40) కాస్త పర్వాలేదనిపించినా, ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో(10, 11, 15 పరుగులు) ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో అతనిపై వేటు వేసి టీ20 నంబర్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌కు(ఇంగ్లండ్‌) అవకాశం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. 

అయితే, ఈ ప్రతిపాదన గంభీర్‌ కొట్టిపారేశాడు. మలాన్‌ ప్రపంచ నంబర్‌ 1 టీ20 బ్యాట్స్‌మెన్‌ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో అతనికి పోలిక ఏంటని ప్రశ్నించాడు. మొదట గేల్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే ఆలోచనను పంజాబ్‌ విరమించుకోవాలని, గేల్‌ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌లన్నీ ఓపెనర్‌గా ఆడినవేనన్న విషయాన్ని మరవకూడదని గంభీర్‌ ప్రస్థావించాడు. ప్రస్తుత సీజన్‌లో గేల్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా 60కిపైగా బంతుల్ని ఎదుర్కొన్నాడని, అదే ఓపెనర్‌గా ఇన్ని బంతల్ని ఎదుర్కొని ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో స్టార్‌ ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ బలహీనమైన మిడిలార్డర్‌ కారణంగా పంజాబ్‌ మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకుంటుందని వ్యాఖ్యానించాడు. 

శుక్రవారం చెపాక్‌ వేదికగా ముంబైతో జరిగే మ్యాచ్‌లో యూనివర్సల్‌ బాస్‌ను ఓపెనర్‌గా పంపాలని, వరుసగా విఫలమవుతున్న నికోలస్‌ పూరన్‌ స్థానంలో మలాన్‌కు అవకాశం కల్పించాలని సూచించాడు. ఓపెనర్లుగా రాహుల్‌, గేల్‌లు వస్తే పంజాబ్‌కు బలమైన పునాది లభిస్తుందని, దీంతో పంజాబ్‌ పరాజయాల పరంపరకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, గేల్‌.. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ నుంచి పం‍జాబ్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇదిలా ఉంటే, పంజాబ్‌ కింగ్స్‌.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం ఒక్క గెలుపు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
చదవండి: కపిల్‌, ధోని, గవాస్కర్‌లతో వాళ్లను పోల్చకండి..

మరిన్ని వార్తలు