IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్‌ కాబోతోందా?!

9 Apr, 2021 11:02 IST|Sakshi

క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీకి తెరలేవనుంది. కరోనా భయాల నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెటర్లు సిద్ధమైపోయారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ ఈసారి భారత్‌లోనే జరగనుండటంతో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు. అయితే, కొన్ని ఊహాగానాలు మాత్రం స్టార్‌ ఆటగాళ్ల ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఈ సీజన్‌ తర్వాత తమ ఆరాధ్య క్రికెటర్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వారి మదిని మెలిపెడుతున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం.

ఎంఎస్‌ ధోని(2008)

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ సింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.  సీఎస్‌కేను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అంతేకాదు ఐదుసార్లు రన్నరప్‌... ఒక్కసారి మినహా ఆడిన ప్రతీ సీజన్‌లో టాప్‌–4లో స్థానం... ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్టుగా సీఎస్‌కే రికార్డు సాధించడంలో ధోని పాత్ర మరువలేనిది. విజయవంతమైన కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న ధోని ఐపీఎల్‌లో ఇప్పటివరకు 204 మ్యాచ్‌లు ఆడి 4632 పరుగులు చేశాడు.

ఇక గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టర్‌ కూల్‌, ఈ సీజన్‌ తర్వాత సీఎస్‌కు కెప్టెన్‌గా రిటైర్‌ అయి మెంటార్‌గా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ధోనిలో అత్యుత్తమ క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్‌ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్‌ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ప్రకటించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

హర్భజన్‌ సింగ్‌(2008)

టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ చాలాకాలం పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా, సీఎస్‌కే తరఫున కూడా మైదానంలో దిగిన భజ్జీ.. ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు తీశాడు. అంతేకాదు, 829 పరుగులు చేశాడు. ఇక సీఎస్‌కే అతడిని వదులుకోవడంతో మినీ వేలం-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హర్భజన్‌ను కొనుగోలు చేసింది. ఇక 38 ఏళ్ల భజ్జీ, ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు స్వస్తి పలుకనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

క్రిస్‌గేల్‌(2009)

విధ్వంసకర విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఐపీఎల్‌లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధిక సిక్సర్లు (349), ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు(17), అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 నాటౌట్‌), అత్యధిక సెంచరీలు (6), ఫాస్టెస్ట్‌ సెంచరీ(30 బంతుల్లో) నమోదు చేసిన ఘనత అతడి సొంతం. ఇప్పటివరకు 132 మ్యాచ్‌లలో 4772 పరుగులు చేసిన 42 ఏళ్ల క్రిస్‌గేల్‌, ఐపీఎల్‌-2021 తర్వాత క్యాష్‌ రిచ్‌లీగ్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడనే ఊహాగానాలు విస్త్రృతమవుతున్నాయి. ఇక పంజాబ్‌ కింగ్స్‌ తరఫున గేల్‌ మైదానంలోకి దిగనున్నాడు. గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.

ఏబీ డివిలియర్స్‌(2011)

అభిమానులు ముద్దుగా మిస్టర్‌ 360 అని పిలుచుకునే దక్షిణాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 169 మ్యాచ్‌లు ఆడి, 4849 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌లో ఏబీడీ మెరుపు విన్యాసాలు చూసే అవకాశం ఉండదనే వార్తలు క్రీడా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌ విభాగంలోనూ పటిష్టంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. కనీసం ఈసారైనా కప్‌ గెలిస్తే.. ఏబీడీ సగర్వంగా రిటైర్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇమ్రాన్‌ తాహిర్‌(2014)

2014లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు సౌతాఫ్రికా ఆటగాడు ఇమ్రాన్‌ తాహిర్‌. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్‌ బౌలర్‌ 80 వికెట్లు తీశాడు. సీఎస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 2018లో జట్టు టైటిల్‌ సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ సీజన్‌ తర్వాత 41 ఏళ్ల తాహిర్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

చదవండి: ఐపీఎల్‌ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!

>
మరిన్ని వార్తలు