వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి

6 Apr, 2021 15:54 IST|Sakshi

ముంబై: వాంఖడే మైదానం వేదికగా 14వ ఎడిషన్‌ ఐపీఎల్ మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని మహారాష్ట్ర సర్కారు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మ‌రో ముగ్గురు సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. వైరస్‌ నిర్ధారణ అయిన వారిలో ఒకరు ప్లంబ‌ర్‌ కాగా, మరో ఇద్దరు గ్రౌండ్‌ స్టాఫ్‌ అని ముంబై క్రికెట్ అసోసియేష‌న్(ఎంసీఏ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా వాంఖడే మైదానంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే మహారాష్ట్ర సర్కార్‌ బీసీసీఐతో సంప్రదింపులు జరిపి, షెడ్యూల్ ప్రకార‌మే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. 

కాగా, టోర్నీని స‌జావుగా న‌డిపే ఉద్దేశంతో మైదాన సిబ్బంది స్టేడియంలోనే బస చేస్తున్నారని, ప్రయాణాలు చేయ‌డం లేద‌ని ఎంసీఏ స్పష్టం చేసింది. కొద్దిరోజుల కిందట ఇదే స్టేడియంలో ప‌ని చేసే ప‌ది మంది సిబ్బందికి క‌రోనా సోకినట్లు బయటపడటంతో ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా ముంబై వేదికగా మొత్తం 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అందులో తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరుగనుంది.
చదవండి: పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్‌

మరిన్ని వార్తలు