ఐపీఎల్‌ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్‌: బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు

4 Apr, 2021 17:52 IST|Sakshi

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తున్న వేళ, ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్లేయ‌ర్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై బీసీసీఐ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు, తర్వలో దీనికి సంబంధించి ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపనున్నట్టు ఆయన వెల్ల‌డించారు. కరోనా ఎప్పుడు అంతమవుతుందో ఎవ్వరికీ తేలీదు కాబట్టి, ఆటగాళ్ల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వ్యాక్సినేషన్‌ ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ముందుగా ప్రకటించిన ఆరు వేదిక‌ల్లో మ్యాచ్‌లు తప్పక నిర్వ‌హిస్తామ‌ని, ఆ దిశ‌గా బ‌యో బ‌బుల్ కూడా ఏర్పాటు చేశామ‌ని చెప్పుకొచ్చారు. ఖాళీ స్టేడియాల్లోనే టోర్నీ మొత్తం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో ఆటగాళ్లతో సహా ఆయా యాజమాన్యాలు, బీసీసీఐ ఆందోళన చెందుతున్నాయి. తొలుత కేకేఆర్‌ ఆటగాడు నితీష్‌ రాణాకు వైరస్‌ నిర్ధారణ కాగా, అతరువాత ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా, ఆర్‌సీబీ యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ను సైతం కరోనా కాటువేయడంతో ఆయా ఫ్రాంఛైజీలు, బీసీసీఐ కరోనా కట్టడి మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ఆటగాళ్లకు వ్యాక్సినేషన్‌ ప్రస్థావనకు తెరపైకి తెచ్చింది. 
చదవండి: భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వార్నర్‌
 

మరిన్ని వార్తలు