కోహ్లిని ఊరిస్తున్న పలు అరుదైన రికార్డులు

14 Apr, 2021 17:43 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరుగనున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చరిత్ర సృషించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 185 ఇన్నింగ్స్‌ల్లో 130.6 స్ట్రయిక్‌ రేట్‌తో 5911 పరుగులు సాధించిన కోహ్లి.. మరో 89 పరుగులు చేస్తే, టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి తరువాత సురేష్ రైనా (5422), రోహిత్ శర్మ (5292), శిఖర్ ధావన్ (5282), డేవిడ్ వార్నర్ (5257)లు ఉన్నారు. 

ఇదిలా ఉంటే లీగ్‌ చరిత్రలో అత్యధిక శతకాల రికార్డు విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌(6 సెంచరీలు) పేరిట ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేసిన కోహ్లి, నేటి మ్యాచ్‌లో మరో శతకం సాధిస్తే గేల్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. కాగా, ఓవరాల్‌ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 9764 పరుగులు చేసిన కోహ్లి... పదివేల పరుగులు పూర్తి చేయడానికి మరో 236 పరుగులు మాత్రమే అవసరం ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్‌లు మాత్రమే పదివేల పరుగులు పూర్తి చేశారు. వీరిలో గేల్ అత్యధికంగా 13000కు పైగా పరుగులు సాధించి అందరికంటే టాప్‌లో ఉన్నాడు.

మరిన్ని వార్తలు