ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్

13 Apr, 2021 12:43 IST|Sakshi
రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు చేతన్‌ సకారియా(ఫొటో: ఐపీఎల్‌)

ముంబై: రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ చేతన్‌ సకారియాపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఇంత అద్భుతంగా రాణిస్తాడని ఊహించలేదన్నాడు. ఏమత్రం బెరుకు లేకుండా ఆడాడని, ఒక మంచి బౌలర్‌కు కావాల్సిన లక్షణాలు తనలో మెండుగా ఉన్నాయని కితాబిచ్చాడు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ అద్భుత సెంచరీతో, యువ పేసర్‌ చేతన్‌ సకారియా మూడు వికెట్లతో రాణించి అభిమానుల మనసు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరూ భాయ్‌ చేతన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘తన పేరు చాలాసార్లు విన్నాను. దేశవాళీ క్రికెట్‌లో తన ఆటను కూడా చూశాను. కానీ ఇంతబాగా బౌల్‌ చేస్తాడని అస్సలు ఊహించలేదు. 

దేశవాళీ క్రికెట్‌లో వివిధ రకాల బ్యాట్స్‌మెన్‌ను తను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే, ఐపీఎల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. స్టార్‌ ఆటగాళ్లే ఎక్కువగా ఉంటారు. జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా పంచుకున్న అభిప్రాయాల ప్రకారం, తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎక్కడ బౌండరీ బాదుతాడేమోనని అస్సలు భయపడకూడదు. అవకాశం దొరికేంతవరకు ఓపికగా వేచి చూసి, గట్టిగా దెబ్బకొట్టాలి. అప్పుడే వికెట్లు ఎలా తీయాలన్న విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. సకారియాలో ఇలాంటి లక్షణాలను నేను చూశాను. ఎంతో పట్టుదలగా ఆడాడు’’ అని ప్రశంసించాడు. 

అదే విధంగా.. ‘‘తన బౌలింగ్‌లో వైవిధ్యం కనబడుతోంది. కొన్నిసార్లు నోబాల్స్‌ వేసి ఉండవచ్చు. అయితే, మయాంక్‌ అగర్వాల్‌ను అవుట్‌ చేసిన తీరు, క్రిస్‌గేల్‌ను తన డెలివరీలతో భయపెట్టిన విధానం ముచ్చటగొలిపింది’’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ 23 ఏళ్ల సౌరాష్ట్ర బౌలర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.  ఇక ఆటపట్ల చేతన్‌ సకారియాకు ఉన్న అంకితభావం గురించి ట్విటర్‌ వేదికగా ప్రస్తావిస్తూ.. ‘‘కొన్ని నెలల క్రితం చేతన్‌ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఈ విషయం తనకు చెప్పలేదు. సయ్యద్‌ ముస్తాక్‌ ట్రోఫీ ఆడుతున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది.

దీనిని బట్టి సకారియా కుటుంబానికి, అతడికి క్రికెట్‌ పట్ల ఉన్న అంకితభావం సుస్పష్టమవుతోంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా, ఆర్‌ఆర్‌ చేతన్‌ సకారియాను 1.20 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక సీజన్‌ తొలి మ్యాచ్‌లో అతడు.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌, జై రిచర్డ్‌సన్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి, 7.80 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఒక నోబ్‌ ఉంది. 

చదవండి:  ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్‌ భావోద్వేగం
బట్లర్‌ సేవలను సరిగా వాడుకోలేదు: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌
‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’

మరిన్ని వార్తలు