Virender Sehwag: పంత్‌ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను

28 Apr, 2021 11:30 IST|Sakshi

అహ్మదాబాద్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయం చెందడానికి ఆ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చేసిన తప్పిదాలే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించాడు. పంత్‌ నుంచి తాను చూసిన అత్యంత పేలవమైన కెప్టెన్సీ అంటూ సెహ్వాగ్‌ మండిపడ్డాడు. క్రిక్‌బజ్‌ నిర్వహించిన మ్యాచ్‌ విశ్లేషణ కార్యక‍్రమంలో పంత్‌ సారథ్యాన్ని సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వచ్చేసరికి ఒక ప్రధాన బౌలర్‌కు బౌలింగ్‌ చేయడం పంత్‌ కెప్టెన్సీలో లోపాన్ని చూపెట్టిందన్నాడు. కెప్టెన్‌ అనేవాడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి బౌలింగ్‌ చేయాలన్నాడు. ‘ఒక ప్రధాన బౌలర్‌ సరిగా బౌలింగ్‌ సరిగా చేయలేకపోతే కెప్టెన్‌ అంచనాలు తప్పువుతాయి. 

అప్పుడే కెప్టెన్‌గా బౌలింగ్‌ మార్పులు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఈ విషయంలో పంత్‌ జాగ్రత్తగా ఉండక తప్పదు. పరిస్థితిని బట్టే వ్యూహాలు సిద్ధం చేసేవాడే స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతాడు. నువ్వు ఈ తరహా తప్పిదాలు ఇక చేయవనే అనుకుంటున్నా. పంత్‌ ఒక మంచి కెప్టెన్‌ కావాలంటే స్మార్‌ క్రికెట్‌ ఆడాలి. అప్పుడే నువ్వు స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతావు. ఆర్సీబీతో మ్యాచ్‌లో పంత్‌ కెప్టెన్సీకి 10కి 5మార్కులు కూడా నేను ఇవ్వలేను. కేవలం మూడు మార్కులు మాత్రమే వేస్తా’ అని సెహ్వాగ్‌ తెలిపాడు. ఇక అదే షోలో ఉన్న ఆశిష్‌ నెహ్రా మాట్లాడుతూ.. మధ్య ఓవర్లలో పంత్‌ స్లో బ్యాటింగ్‌ చేయడమే వారి ఓటమికి కారణమన్నాడు. ఛేజింగ్‌ చేసే క్రమంలో ఇద్దరు సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ ఉండగా ఓటమి ఎదురుకావడం ప్రణాళిక లోపమేనన్నాడు. అందులోనూ పరుగు తేడాతో పరాజయం చెందడం కచ్చితంగా ప్లానింగ్‌ లేకపోవడమేనన్నాడు. 

ఇక్కడ చదవండి: 
ఏబీ.. నీకు హ్యాట్సాఫ్‌: కోహ్లి
అందుకే ఆఖరి ఓవర్‌ స్టోయినిస్‌ చేతికి: పంత్‌

మరిన్ని వార్తలు