Virender Sehwag: అతడు సరిగ్గా ఆడకపోయినా.. ధోనీ తుదిజట్టు నుంచి తప్పించడు!

1 Oct, 2021 13:41 IST|Sakshi

Virender Sehwag Comments On Suresh Raina: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా.. ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తుదిజట్టులో అతడికి చోటు దక్కింది. ఇక గురవారం నాటి విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్‌ చేరే నాటికి.. సీజన్‌లో మొత్తంగా అతడు చేసిన పరుగులు 157. స్ట్రైక్‌రేటు 127.64. అయితే... తొలి దశలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన రైనా.. ఆ తర్వాత మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

ఇక నిన్న (సెప్టెంబరు 30)  హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కేవలం రెండు పరుగులు చేసి హోల్డర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రైనా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే కెప్టెన్‌ ధోని... రైనా ఫామ్‌లో లేకపోయినా సరే.. అతడికి తుది జట్టులో అవకాశమిస్తాడని పేర్కొన్నాడు.

అందుకు గల కారణాలు విశ్లేషిస్తూ... ‘‘రైనా సరిగ్గా ఆడటం లేదని ధోనికి తెలుసు. అయినప్పటికీ ఈ ఎడమ చేతి వాటం గల బ్యాటర్‌ను తుదిజట్టు నుంచి తప్పించే ఆలోచన చేయడు. రైనా 20-30 బంతులైనా ఎదుర్కోవాలి. కనీసం 10-20 పరుగులైనా చేయాలి. అప్పుడే మళ్లీ తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగుందని సీఎస్‌కేకు తెలుసు. శార్దూల్‌ ఠాకూర్‌ కూడా బ్యాట్‌తో రాణించగలగడం వారికి అదనపు బలం. 


Photo Courtesy: IPL/BCCI

కాబట్టి వాళ్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి ప్లే ఆఫ్స్‌కు ముందే రైనా ఫాంలోకి రావాలని ధోని భావించాడు. కానీ.. అలా జరుగలేదు. అయినా, రైనా వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఒక్కసారి పుంజుకుంటే పరుగులు చేయడం అసాధ్యమైమీ కాదు’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు. కాగా సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సైతం రైనా జట్టుకు అవసరమైన సమయంలో తప్పక రాణిస్తాడంటూ అతడికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.

చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్‌ ఇంకా బతికే ఉన్నాడు!

>
మరిన్ని వార్తలు