అందుకోసమే బంతి విసిరాను..రనౌట్‌ ఊహించలేదు

18 Apr, 2021 14:09 IST|Sakshi
Photo Courtesy: Mumbai Indians Twitter

చెన్నై:  ముంబై ఇండియన్స్‌తో నిన్న(శనివారం) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపు ముంగిట బోల్తా పడింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల ఛేదనలో 137 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ రనౌట్‌ కావడమే టర్నింగ్‌ పాయింట్‌.  పొలార్డ్‌ వేసిన 12 ఓవర్‌ మూడో బంతిని విరాట్‌ సింగ్‌కు వేస్తే దాన్ని ఫ్లిక్‌ చేశాడు. ఆ సమయంలో విరాట​ సింగ్‌ సింగిల్‌ కోసం వద్దనుకున్నా వార్నర్‌ పిలుపుతో పరుగు అందుకున్నాడు. 

కానీ వార్నర్‌ రనౌట్‌  అయ్యాడు. హార్దిక్‌ పాండ్యా స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో వార్నర్‌ పెవిలియన్‌కు చేరాడు. పాయింట్‌ రీజన్‌లో ఉన్న హార్దిక్‌ ఒక్క ఉదుటన బంతి పైకి దూకి నేరుగా స్టైకింగ్‌ ఎండ్‌లో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి వార్నర్‌ క్రీజ్‌లోకి రావడానికి ఇంకా చాలా దూరంలోనే ఉండటంతో ఎటువంటి థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం లేకుండానే డగౌట్‌ బాట పట్టాడు. ఇది సన్‌రైజర్స్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం. వార్నర్‌ రనౌట్‌ కాకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేది.

దీనిపై మ్యాచ్‌ తర్వాత హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘నేను ఫీల్డింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించను. నిజంగా చెప్పాలంటే వార్నర్‌ రనౌట్‌ అనేది నేను కూడా ఊహించలేదు. నేను కేవలం బంతి పాత బడిందా అనే విషయం తెలుసుకోవడానికి విసిరాను. అప్పటికి వార్నర్‌ చాలా దూరంలో ఉన్నాడనే విషయం గ్రహించలేదు. అతను రనౌట్‌ అయిన తర్వాత కానీ వార్నర్‌ క్రీజ్‌కు చాలా దూరంలో ఉన్నాడనే తెలిసింది’ అని బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌  స్పోర్ట్స్‌కు వెల్లడించాడు. 

ఇక్కడ చదవండి: వేలంలోనూ దూకుడు లేదు.. ఆటలోనూ లేదు
ఇలా ఆడితే గెలవలేం: వార్నర్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు