అతను బంతితో మ్యాజిక్‌ చేయడం చూడాలి: ముంబై కోచ్‌

19 Apr, 2021 18:35 IST|Sakshi
Photo Courtesy : IPL/BCCI

చెన్నై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌ను చేజార్చుకున్న ముంబై ఇండియన్స్‌.. ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(కేకేఆర్‌, సన్‌రైజర్స్‌) విజయదుందుభి మోగించి గెలుపు బాట పట్టింది. ఏప్రిల్‌ 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనున్న ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆ జట్టు ప్రధాన కోచ్‌ మహేళ జయవర్ధనే మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన చాలా విషయాలను పంచుకున్నాడు. 

ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా తిరిగి బంతితో మ్యాజిక్‌ చేయడం చూడాలని ఉందని ఆకాంక్షించాడు. గాయం నుంచి కోలుకున్న చాలా కాలం తరువాత ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో హార్ధిక్‌ బౌలింగ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్ధిక్‌ను బౌలింగ్‌ చేయమనే సాహసం చేయలేమని, కానీ కొద్ది వారాల్లో అతను తిరిగి బంతిని అందుకోవడం చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన ముంబై తురుపు ముక్క సూర్యకుమార్‌ యాదవ్‌ గురించి కూడా ప్రస్థావించాడు. సూర్యకుమార్‌ ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్ధుడని, అతను ముంబై ఇండియన్స్‌ ఆస్తి అని కొనియాడాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై జట్టు.. అతి త్వరలో అగ్రస్థానానికి ఎగబాకుతుందని ఆయన జోస్యం చెప్పాడు. ముంబై జట్టు తొలి మ్యాచ్‌ కోల్పోయి, తిరిగి గాడిలో పడిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశాడు. కాగా, హార్ధిక్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 42 వికెట్లు పడగొట్టాడు. అతను చివరిసారిగా 2019 సీజన్‌లో బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్‌ కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో అతను బంతితోనైనా రాణించాలని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. 
చదవండి: బాగా బౌలింగ్‌ చేసినప్పుడు వికెట్‌ దక్కకపోతే ఆ బాధే వేరు..

మరిన్ని వార్తలు