వచ్చే ఐపీఎల్‌ కూడా యూఏఈలోనే! 

20 Sep, 2020 03:02 IST|Sakshi

బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం  

దుబాయ్‌: కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (యూఏఈ) తరలించిన బీసీసీఐ... వచ్చే సీజన్‌ విషయంలో కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2021 ఐపీఎల్‌ సమయానికి మన దేశంలో కరోనా అదుపులోకి రాకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, పరస్పర సహకారంతో టోర్నీల నిర్వహణలో భాగంగా బీసీసీఐ, యూఏఈ క్రికెట్‌ బోర్డు మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. జై షాతో పాటు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.

మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టు సిరీస్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిని కూడా యూఏఈలోనే జరిపే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏటా షెడ్యూల్‌లాగే ఏప్రిల్‌–మేలోనే ఐపీఎల్‌ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు... ఇంగ్లండ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ఎడారి దేశాన్ని చూసినట్లు చెప్పారు.  2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు (2006లో పాక్‌తో 2 వన్డేల సిరీస్‌ మినహా) నిరాకరిస్తూ  వచ్చింది. అయితే 2014లో కొన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించిన తర్వాత బీసీసీఐ మెత్తబడింది. 2018లో ఇక్కడే జరిగిన ఆసియా కప్‌లో కూడా భారత్‌ పాల్గొంది.   

>
మరిన్ని వార్తలు