సన్‌రైజర్స్‌ చేసిన తప్పిదం అదేనా?

12 Apr, 2021 07:53 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌-2021లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌నే విజయం వరించింది. సన్‌రైజర్స్‌ కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది. కేకేఆర్‌ నిర్దేశించిన 189 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ గెలుపు అంచుల వెళ్లి చతికిలబడింది. బెయిర్‌ స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మనీష్‌‌ పాండే (61 నాటౌట్‌) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. డేవిడ్‌ వార్నర్ ‌(3) ఆదిలోనే నిష‍్రమించగా, ఆపై సాహా (7) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో బెయిర్‌ స్టో-మనీష్‌ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది. కాగా, బెయిర్‌ స్టో ఔటైన తర్వాత మనీష్‌ పాండేపై భారం పడింది. పాండే పోరాడినా పరాజయం తప్పలేదు. సన్‌రైజర్స్‌ 177 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

సన్‌రైజర్స్‌ తప్పు చేసిందా?
ఓవరాల్‌గా చూస్తే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ప్రదర్శన ఆకట్టుకుందనే చెప్పాలి. కాగా, 10 పరుగుల తేడాతో ఓటమి పాలవడం అభిమానుల్ని బాధించింది. కేన్‌ విలియమ్సన్‌ను తీసుకోకపోవడం వల్లే ఓటమి చెందామని ఆరెంజ్‌ ఆర్మీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. మ్యాచ్‌ ఆరంభమైన దగ్గర్నుంచీ కేన్‌ మామ ఎక్కడ అని సోష‍ల్‌ మీడియా హోరెత్తిపోయింది. మరి నిజంగానే ఆరెంజ్‌ ఆర్మీ తప్పు చేసిందా అంటే.. అవుననక తప్పదు. నబీ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను వేసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది.

భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, రసీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌లు బౌలర్ల రూపంలో ఉండగా నబీకి చోటివ్సాల్సిన అవసరం లేదు. విదేశీ ప్లేయర్ల కోటాలో నబీ స్థానంలో కేన్‌ను ఆడించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒక బౌలర్‌గా నబీ 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి 32 పరుగులిచ్చాడు. బౌలర్‌గా రాణించినా బ్యాట్‌తో విఫలం కావడంతో కేన్‌ను తీసుకోకుండా పొరపాటు చేశామని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కూడా భావించి ఉండవచ్చు. అసలు సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో వార్నర్‌ విఫలం కావడం, కేన్‌ లేకపోవడమే ఓవరాల్‌గా వారి ఓటమిపై ప్రబావం చూపించింది.
(చదవండి: ‘సన్‌’ సత్తా సరిపోలేదు )

మరిన్ని వార్తలు