రోహిత్‌.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్‌ వద్దనగలమా?

24 Apr, 2021 14:44 IST|Sakshi
Photo Courtesy: BCCI/IPL

చెన్నై: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం చెందడానికి ఆ జట్టు స్వీయ తప్పిదమే కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తమ ఓటమికి బ్యాట్స్‌మెన్‌ కారణమని పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ స్పష్టం చేయగా, అసలు రోహిత్‌ చేసిన తప్పిదాలే ముంబై ఓటమికి ప్రధాన కారణమని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, అజేయ్‌ జడేజాలు విమర్శించారు. పంజాబ్‌ కింగ్స్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో భాగంగా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ రోహిత్‌ అమలు చేసిన ప్రణాళికల్లో లోపాల్ని ఎత్తి చూపారు. ప్రధానంగా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఫస్ట్‌ డౌన్‌లో కాకుండా సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ పంపడమే ముంబై ఓటమికి ఓ ముఖ్య కారణమని ధ్వజమెత్తారు. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను పక్కను పెట్టి,  వరుసగా విఫలం అవుతున్న ఇషాన్‌ కిషన్‌ను ఫస్ట్‌ డౌన్‌లో పంపడమే ముంబై కొంపముంచిందని మండిపడ్డారు. 

‘ఇషాన్‌ కిషన్‌ నాలుగు గేమ్‌ల నుంచి 2-3 పరుగులే అన్నట్లు ఉన్నాడు. అతనికి పరుగులు చేసే సత్తా ఉంది. కానీ బాగా ఆడే సూర్యకుమార్‌ యాదవ్‌ను కిందకు పంపడం ఎందుకు. రెండు-మూడు వికెట్లు తొందరగా పడిపోతే ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌పై కూడా ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ సూర్యకుమార్‌ ఆర్డర్‌ మార్చి తప్పుచేశారు. పవర్‌ ప్లేలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఉండి ముంబైకి మరిన్ని పరుగులు వచ్చేవి.  ముంబై బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌-రోహిత్‌లు 15-16 ఓవర్లకు ఆడటం ఒక మంచి పరిణామం. వారు భయంలేని క్రికెటర్లు.. భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నవారు. కానీ వారు అలా చేయలేదు. దాంతోనే ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది’ అని సెహ్వాగ్‌ విశ్లేషించాడు. 

ఇక అజయ్‌ జడేజా మాట్లాడుతూ..  సెహ్వాగ్‌తో అంగీకరించాడు. ముంబై కనీసం 150 పరుగులు కూడా చేయకపోవడానికి వారు బాగా ఆడలేకపోవడం ఒకటైతే, అసలు షాట్లు ఆడకపోవడం మరొకటన్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి రెండు-మూడు వికెట్లు పడిపోతే అప్పుడు సూర్యకుమార్‌ను ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను పంపే  సాహసం చేయలేరు. ఇది ఒకే. కానీ పంజాబ్‌తో మ్యాచ్‌లో అలా జరగలేదు. మీరు చెప్పండి.. సెహ్వాగ్‌ను ఓపెనింగ్‌ పంపకుండా ఆపి కింది స్థానంలో పంపమని అడిగితే ఎలా ఉంటుంది. ఇది కూడా అలానే ఉంది’ అని జడేజా ఎద్దేవా చేశాడు.  నిన్నటి మ్యాచ్‌లో ముంబై ముందుగా బ్యాటింగ్‌ చేసి 131 పరుగులు చేసింది. డీకాక్‌, రోహిత్‌లు ఓపెనర్లుగా రాగా, ఇషాన్‌ కిషన్‌ ఫస్ట్‌ డౌన్‌లో వచ్చాడు. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపడం విమర్శలకు దారి తీసింది. 

ఇక్కడ చదవండి: వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్‌
పొలార్డ్‌ను చూడండి.. ఎలా లైన్‌ దాటేస్తున్నాడో?

మరిన్ని వార్తలు