వారితో కలిసి ఆడడమే గొప్ప విషయం: సాహా

31 Mar, 2021 11:46 IST|Sakshi

ముంబై: టీమిండియా టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జట్టుతో పాటు ప్రాక్టీస్‌ ఆరంభించిన సాహా.. సచిన్‌,గంగూలీ, ధోని, కోహ్లి లాంటి దిగ్గజ క్రికెటర్ల నుంచి తాను పొందిన సలహాలను మీడియాతో పంచుకున్నాడు. 

సచిన్‌ టెండూల్కర్‌:
సచిన్‌ విషయానికి వస్తే.. నా డెబ్యూ క్యాప్‌ను అతని‌ నుంచి అందుకోవడం గొప్పగా భావిస్తున్నా. ఇది నిజంగా మరిచిపోలేని రోజు. సచిన్‌తో కలిసి ఆ టెస్టు మ్యాచ్‌ ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. 

సౌరవ్‌ గంగూలీ:
దాదా(సౌరవ్‌ గంగూలీ)తో కలిసి నేను అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడకపోయినా.. బెంగాల్‌ జట్టు తరపున మాత్రం ఆడాను. దేశవాలీ మ్యాచ్‌ సందర్భంగా అతను ఇచ్చిన సలహాలు ఇప్పటికి గుర్తున్నాయి. 

ఎంఎస్‌ ధోని:
ధోని బాయ్‌ నన్ను ఎంతో ప్రోత్సహించేవాడు. అతను టెస్టు కీపర్‌గా ఉన్న కాలంలోనే నేను జట్టులోకి వచ్చాను. అవకాశాలు ఎక్కువగా రాకపోయినా.. ధోని బాయ్‌ ఇచ్చిన సలహాలు  ఎన్నటికి మరువలేనివి. అంతేకాదు ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ధోని నాయకత్వంలో ఆడడం గొప్ప విషయం.

విరాట్‌ కోహ్లి:
ప్రస్తుత తరంలో గొప్ప కెప్టెన్లలో కోహ్లి ఒకడు. అతనితో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోయే గొప్ప వ్యక్తిత్వం కోహ్లి దగ్గర ఉంది.  

కాగా వృద్ధిమాన్‌ సాహా టీమిండియా జట్టులోకి లేటు వయసులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2010లో దక్షిణాఫ్రికా పర్యటనకు రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికైన సాహా.. వివిఎస్‌ లక్ష్మణ్‌, రోహిత్‌ శర్మలు గాయపడడంతో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు ఆడిన సాహాకు 2017లో ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 233 బంతుల్లో 117 పరుగులు చేసిన సాహా పుజారాతో కలిసి ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా.. సాహా కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

2020లో ఆసీస్‌ పర్యటన సందర్భంగా మొదటి టెస్టు మ్యాచ్‌లో సాహా ఘోరంగా విఫలం కావడంతో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ పర్యటనలో పంత్‌ విశేషంగా రాణించడం.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పంత్‌ దూకుడైన ఆటతీరు ప్రదర్శించడంతో సాహా క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మొత్తంగా ఇప్పటివరకు సాహా టీమిండియా తరపున 38 టెస్టుల్లో 1251 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు సాధించాడు.
చదవండి: సన్‌రైజర్స్ కెప్టెన్‌ గుడ్‌న్యూస్‌

ఈ క్యాచ్‌ చూశాక మాట్లాడండి బాస్‌!

మరిన్ని వార్తలు