కమాన్‌ సౌతాఫ్రికా.. ఇంకెందుకు ఆలస్యం?

19 Apr, 2021 16:29 IST|Sakshi
Photo Courtesy: RCB Twitter

కింగ్‌స్టన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు తరఫున పునరాగమనం చేసుకునే క్రమంలో ఏబీ డివిలియర్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన మార్గాన్ని మరింత సులభతరం చేసుకుంటున్నాడు. 2018 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ.. తిరిగి మళ్లీ ఆడటానికి యత్నించినా ఇప్పటివరకూ కుదరలేదు. 2019 వరల్డ్‌కప్‌ సమయంలో ఏబీ తాను ఆడతాననే సంకేతాలిచ్చినా అప్పటికే సమయం దాటి పోవడంతో సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏబీకి దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది. దాంతో  ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఇప్పటికే ఐపీఎల్‌లో తనలోని పదును ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్న ఏబీడీ.. వరల్డ్‌కప్‌ ఆడటం దాదాపు ఖాయమే. 

కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడైన ఏబీడీ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ఆర్సీబీ రెండొందల స్కోరును అవలీలగా దాటింది. నిన్నటి మ్యాచ్‌లో ఏబీ ఇన్నింగ్స్‌ను చూసిన జమైకా స్ప్రింట్‌ లెజెండ్‌ యెహాన్‌ బ్లేక్‌.. కచ్చితంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు అతన్ని తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఏబీ ఇన్నింగ్స్‌ కొనియాడుతూ పోస్ట్‌ పెట్టాడు. ‘వావ్‌ డివిలియర్స్‌.  ఏబీ అంటేనే డిఫరెంట్‌ అని చూపించావ్‌.. కమాన్‌ సౌతాఫ్రికా.. ఇంకెందుక ఆలస్యం. అతని అవసరం మీకు ఎంతో ఉంది.. జట్టులో అవకాశం ఇవ్వండి’ అని ట్వీట్‌ చేశాడు. ఏబీకి స్థానంపై ఇప్పటికే కోచ్‌ బౌచర్‌ నుంచి హామీ లభించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఆడతాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్‌ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి

మరిన్ని వార్తలు