ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టావ్‌.. అప్పటికే మ్యాచ్‌ పోయింది!

12 Apr, 2021 17:18 IST|Sakshi

అది ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిపోయే మ్యాచ్‌ కాదు

మనీష్‌కు బంతులు సరిగా అందలేదు

కొన్నిసార్లు అలానే ఉంటుంది

పాండేకు వీరేంద్ర సెహ్వాగ్‌ మద్దతు

చెన్నై:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు మనీష్‌ పాండే కడవరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడానికి కారణం బంతులు అతని రాడార్‌లో పడకపోవడేమేనని టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. అసలు చివరి మూడు ఓవర్లలో మనీష్‌ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడానికి బంతులు అతని అంచనాకు అందకపోవడమేనన్నాడు.  

ఎంతో ఒత్డిడి భరిస్తూ ఒక సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ మ్యాచ్‌ను గెలిపించే యత్నంచేసినా అది సఫలం కాలేదన్నాడు.  క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘ చివరి మూడు ఓవర్లు చూడండి. పాండే ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. చివరి బంతికి సిక్స్‌ కొట్టినా అప్పటికి మ్యాచ్‌ అయిపోయింది. మనీష్‌ నిజంగానే కీలక పాత్ర పోషించాడు. 

ముఖ్యమైన వికెట్లు పడిపోయినప్పుడు క్రీజ్‌లో నిలదొక్కుకుని మ్యాచ్‌ను గెలిపించే దిశగా ప్రయత్నం చేశాడు. చాలా ఒత్తిడిలో  క్రీజ్‌లో సెట్‌ అయ్యాడు. మనీష్‌ ఇంకొన్ని బౌండరీలు కొట్టుంటే ఆ మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదు. మనీష్‌ అనుకున్న రాడార్‌లో బంతులు పడలేదు.  అందుకే విఫలమయ్యాడు.  కొన్ని సార్లు అలానే జరుగుతుంది.  మనీష్‌ సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌. అయినప్పటికీ బంతులు హిట్‌ చేసేందుకు ఏమాత్రం వీలుకాలేదు. లేకపోతే సన్‌రైజర్స్‌ ఆ మ్యాచ్‌ ఓడిపోయేది కాదు’ అని చెప్పుకొచ్చాడు.

నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 177 పరుగులు చేసి పరాజయం పాలైంది. మనీష్‌ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మనీష్‌ పాండే క్రీజ్‌లో ఉండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలుస్తుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు భావించినా కేకేఆర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయాన్ని అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో వార్నర్‌(3), సాహా(7)లు ఆరంభంలో పెవిలియన్‌ చేరగా,  మనీష్‌-బెయిర్‌ స్టోలు 92 పరుగులతో గాడిలో పెట్టారు. బెయిర్‌ స్టో మూడో వికెట్‌గా ఔటైన తర్వాత ఆరెంజ్‌ ఆర్మీపై ఒత్తిడి పడింది. మహ్మద్‌ నబీ(14), విజయ్‌ శంకర్‌(11)లు విఫలం అయ్యారు. చివర్లో అబ్దుల్‌ సామద్‌(19 నాటౌట్‌) రెండు సిక్స్‌లతో అలరించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

మరిన్ని వార్తలు