మ్యాచ్‌ ఓడినందుకు షారుఖ్‌ క్షమాపణ.. స్పందించిన రసెల్‌

14 Apr, 2021 17:26 IST|Sakshi
Courtesy: IPL Twitter‌

చెన్నై: మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ పరాజయం చెందడంపై ఆ జట్టు సహ యజమాని షారుఖ్‌ క్షమాపణ చెప్పాడు. ''మ్యాచ్‌ ఓడిపోయినందుకు క్షమించండి.. ముంబై చేతిలో ఓడినప్పటికి తమ కుర్రాళ్లపై పూర్తి విశ్వాసం ఉందని.. రానున్న మ్యాచ్‌ల్లో అది నిలుపుకుంటారన్న నమ్మకం ఉంది'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా షారుఖ్‌ ట్వీట్‌పై ఆ జట్టు ఆటగాడు.. ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ స్పందించాడు.

''షారుఖ్‌ చేసిన ట్వీట్‌ను నేను సమర్థిస్తాను. ఓటమి అనేది ప్రతీ జట్టుకు మామూలే. క్రికెట్‌ అంటే ఇలాగే ఉంటుంది. ఎంత ఆసక్తికరంగా సాగినా.. చివరికి ఏదో ఒక జట్టు ఓడిపోవాల్సిందే. ముంబై ఇండియన్సతో మేం నాణ్యమైన క్రికెట్‌ ఆడాం. మా కుర్రాళ్ల ప్రదర్శన బాగానే ఉంది.. వారిపై ఆత్మవిశ్వాసం ఉంది. మ్యాచ్‌లో ఓటమి చెందడంపై నిరాశం చెందాం.. కానీ ఇది ముగింపు కాదు.. లీగ్‌లో ఇది మాకు రెండో మ్యాచ్‌ మాత్రమే. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. నేను వందల టీ20 మ్యాచ్‌లు ఆడాను. ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నా. మొదట్లో స్పష్టమైన ఆధిపత్యం చూపించే జట్లు హఠాత్తుగా ఓడిపోవడం చాలాసార్లు చూశాను. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. రానున్న మ్యాచ్‌లకు ఆ తప్పులను పునరావృతం కాకుండా జట్టులో కొన్ని మార్పులతో బరిలోకి దిగనున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా  ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. 2 ఓవర్లు మాత్రమే వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే ముంబై విధించిన 152 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌  రాహుల్‌ చహర్‌ స్పిన్‌ ఉచ్చులో చిక్కుకొని 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కాగా కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 18న చెన్నై వేదికగా ఆర్‌సీబీతో తలపడనుంది.  
చదవండి: కేకేఆర్‌ మిడిలార్డర్‌పై ధ్వజమెత్తిన వీరూ

నిర్లక్ష్యమే కేకేఆర్‌ కొంపముంచింది: లారా

మరిన్ని వార్తలు