సందీప్‌ ఓకే.. కానీ వరుణ్‌ కోలుకోవాల్సి ఉంది

4 May, 2021 15:51 IST|Sakshi
Courtesy: IPL Twitter

కోల్‌కతా: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోనూ కరోనా కేసులు వెలుగుచూడడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాగా కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ కరోనా పాజిటివ్‌గా తేలిన వరుణ్‌, సందీప్‌ల పరిస్థితి గురించి వివరించారు.

'కరోనా బారిన పడిన సందీప్‌, వరుణ్‌ చక్రవర్తిలు కోలుకుంటున్నారు. సందీప్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. వరుణ్‌కు మాత్రం ఇంకా పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే వరుణ్‌ పరిస్థితి కాస్త మెరుగైంది. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ కూడా ఎప్పటికప్పుడు ఆటగాళ్ల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేకేఆర్‌ ఆటగాళ్లతో సహా సిబ్బందిని ఐసోలేషన్‌కు పంపించాం. వారందరికి కరోనా టెస్టులు నిర్వహించామని... ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని' చెప్పుకొచ్చాడు.

ఇక ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్‌-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. 
చదవండి: IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు