మా మదిలో అదే ఉంది: అదే మా కొంప ముంచింది.: ధోని

11 Apr, 2021 07:53 IST|Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైంది. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ ముందు ఉంచినా అది పెద్ద లక్ష్యమే కాకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అవలీలగా లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో శుభారంభం చేసింది. కాగా, మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా మ్యాచ్‌ 7.30 నిముషాలకు ప్రారంభం కావడంతో ప్రత్యర్థి ఢిల్లీ జట్టు మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టిందన్నాడు. ఈ పిచ్‌ చాలా పేలవంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ అనేది కష్టంగా మారిందన్నాడు. "ఇక్కడ మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పిచ్‌పై డ్యూ (తేమ) కనబడింది. అది తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. పిచ్‌పై మంచు ఉంటే అది ఛేజింగ్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఎప్పుడైనా తేమ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

టాస్‌ ఓడిపోయిన ముందుగా బ్యాటింగ్‌ వెళ్లాల్సి వచ్చిన సమయంలో మా మనసులో ఒకటే ఉంది. ఈ పిచ్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే అనుకున్నాం. అలాగే తొలి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలనుకున్నాం అది కుదరలేదు. మేం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని బోర్డుపై ఉంచాలనే అనుకున్నాం. అదే లక్ష్యంతో బ్యాటింగ్‌ చేశాం. ఇంకా 15-20 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.  పిచ్‌పై తేమ ఉండటంతో ఆరంభంలో బంతి గమనంపై అంచనా దొరకదు.

బంతి ఆగుతూ వచ్చింది .ఫలితంగా ఆరంభంలో కీలక వికెట్లను చేజార్చుకున్నాం. అయినా మా బ్యాటర్స్‌ బాగా ఆడారు. మా బౌలింగ్‌ ఇంకా మెరుగుపడాలి. బౌలర్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. వారు ప్రత్యర్థికి బౌండరీలు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్లు కనబడింది. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్‌ ఒక గుణపాఠం. ఈ తరహా పిచ్‌పై 200 పరుగులు ఉంటేనే గెలుస్తాం. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి సక్సెస్‌ అయ్యారు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బాల్స్‌ నిజంగా అద్భుతం’ అని ధోని పేర్కొన్నాడు.

ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాదించింది. రైనా (54), మొయిన్‌ అలీ (36)లు దూకుడుగా ఆడగా,  సామ్‌ కరాన్ ‌(34) బ్యాట్‌ ఝుళిపించాడు. రాయుడు (23), రవీంద్ర జడేజా (26 నాటౌట్‌)లు ఫర్వాలేదనిపించడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు సాదించగలిగింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. పృథ్వీ షా (72), శిఖర్‌ ధవన్‌ (85)లు రాణించగా, స్టోయినిస్‌ (14) మూడు ఫోర్లతో కాసేపు మెరుపులు మెరిపించాడు. పంత్ ‌(15 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ ఫినిష్‌‌ చేశాడు.

మరిన్ని వార్తలు