IPL 2022 RCB Vs GT: అలా అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరలేదు.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్‌

19 May, 2022 13:03 IST|Sakshi
ఆర్సీబీ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022 RCB Vs GT: ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కేవలం 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవలేదని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై భారీ తేడాతో ఓడిస్తేనే టోర్నీలో కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో ఆర్సీబీ ఏడింట గెలిచి.. 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ సైతం 7 విజయాలే సాధించినా.. రన్‌రేటు పరంగా ఆర్సీబీ కంటే మెరుగైన స్థితిలో ఉంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీ కంటే ఓ అడుగు ముందే ఉంది. దీంతో చివరిదైన మ్యాచ్‌లో గుజరాత్‌ను భారీ తేడాతో ఓడించినట్లయితేనే ఆర్సీబీ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. బెంగళూరు ప్లే ఆఫ్స్‌ అవకాశాల గురించి యూట్యూబ్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

‘‘ఒకవేళ ఈరోజు(మే 19) ఆర్సీబీ గెలిస్తే వాళ్లకు 16 పాయింట్లు వస్తాయి. తద్వారా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే, ఢిల్లీకి కూడా మరో మ్యాచ్‌ మిగిలి ఉంది. వాళ్లు అందులో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అయితే.. రన్‌రేటు పరంగా ముందున్న ఢిల్లీ.. ఆర్సీబీని వెనక్కినెట్టగలదు.

కాబట్టి.. రేసులో ముందుండాలంటే బెంగళూరు 16 పాయింట్లు సాధించడం ఎంత ముఖ్యమో.. నెట్‌ రన్‌రేటుపై దృష్టి సారించడం కూడా అంతే ముఖ్యం. ఇదేమీ కాకుండా కేవలం 14 పాయింట్లతో క్వాలిఫై అవడం మాత్రం అస్సలు జరగని పని’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇక ఆర్బీసీ బ్యాటర్ల ఆట తీరుపై స్పందిస్తూ.. ‘‘ఆరంభంలో వాళ్లు ఎంతో గొప్పగా ఆడారు. కానీ నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసిస్‌, మాక్స్‌ వెల్‌ స్కోరు చేయకపోతే.. గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఏదేమైనా గుజరాత్‌పై భారీ తేడాతో గెలిస్తేనే టోర్నీలో నిలుస్తారని పునరుద్ఘాటించాడు. కాగా ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. కేకేఆర్‌పై అద్భుత విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ సైతం అర్హత సాధించింది. 16 పాయింట్లతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆ జట్టుకు కూడా ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉంది.

చదవండి👉🏾Shreyas Iyer: ఐపీఎల్‌-2022.. కేకేఆర్‌ అవుట్‌.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్‌

>
మరిన్ని వార్తలు