IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి!

18 May, 2022 11:15 IST|Sakshi
రాహుల్‌ త్రిపాఠిపై ప్రశంసల జల్లు(PC: IPL/BCCI)

IPL 2022 SRH Vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే రైజర్స్‌ జట్టుకు విజయాలు సాధ్యమవుతాయని కొనియాడాడు. ప్రత్యర్థి బౌలర్‌ బుమ్రా అయినా, ఇంకెవరైనా అతడి ఆట తీరులో మార్పు ఉండదని, అద్భుతమైన షాట్లతో ఆ‍కట్టుకోవడం మాత్రమే తనకు తెలుసునంటూ ప్రశంసించాడు. తనకు అత్యంత ఇష్టమైన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ రాహుల్‌ త్రిపాఠి అంటూ ఈ 31 ఏళ్ల ఆటగాడిని ఆకాశానికెత్తాడు.

కాగా ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం(మే 17) నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది విలియమ్సన్‌ బృందం. రాహుల్‌ త్రిపాఠి(76)కు తోడు ప్రియమ్‌ గార్గ్‌(42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ త్రిపాఠి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఫలితాన్ని విశ్లేషించిన ఆకాశ్‌ చోప్రా రాహుల్‌ త్రిపాఠి ఆట తీరుకు తాను ఫిదా అయినట్లు పేర్కొన్నాడు. ‘‘రాహుల్‌ త్రిపాఠి.. 44 బంతుల్లో మూడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్ల సాయంతో 76 పరుగులు చేశాడు.

స్ట్రైక్‌రేటు 172. సన్‌రైజర్స్‌ ఎప్పుడు గెలిచినా అది త్రిపాఠి వల్లే. తను తొందరగా అవుట్‌ అయితే, జట్టు కూడా అంతే తొందరగా అవుట్‌ అవుతుంది. భారత్‌లోని అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లలో నా ఫేవరెట్‌ రాహుల్‌ త్రిపాఠి. తను ఐపీఎల్‌ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నా.. స్పిన్నర్‌, పాస్ట్‌ బౌలర్‌.. ఎదురుగా ఎవరున్నా తను లెక్కచేయడు. బుమ్రానో.. మరొకరినో తీసుకురండి.. త్రిపాఠి ఆట తీరులో మార్పు ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు.

ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్‌ నేపథ్యంలో.. ‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ అందుబాటులో లేడు కాబట్టి.. రాహుల్‌ త్రిపాఠిని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయకూడుదు? ఒకవేళ అతడికి అవకాశం దొరికితే.. తనను తాను నిరూపించుకోగలడు. టీమిండియాలో టీ20 రెగ్యులర్‌ ప్లేయర్‌ కాగలడు’’ అంటూ సెలక్టర్లు రాహుల్‌ త్రిపాఠి పేరును పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్‌ చోప్రా సూచించాడు.

Poll
Loading...
మరిన్ని వార్తలు