Ishan Kishan: అప్పుడు నా గుండె జారినంత పనైంది.. ఆ విషయంలో డౌట్‌ లేదు.. కానీ ఆఖరికి ఇలా!

23 Feb, 2022 11:37 IST|Sakshi

IPL 2022 Auction: ఐపీఎల్‌-2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్‌ కిషన్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రిటెన్షన్‌లో భాగంగా ఇషాన్‌ను వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో మాత్రం ఏకంగా 15.25 కోట్లు ఖర్చు చేసి అతడిని సొంతం చేసుకుంది. మిగతా జట్లతో పోటీ పడి మరీ ఇషాన్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడియా అతడు రికార్డు నెలకొల్పాడు.

ఈ విషయం గురించి ఇషాన్‌ కిషన్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. వేలం జరుగుతున్న వేళ తన మనసులో చెలరేగిన అలజడి గురించి చెప్పుకొచ్చాడు. ‘‘ముంబై కచ్చితంగా నన్ను కొనుగోలు చేస్తుందని తెలుసు. ఆ విషయంలో నాకు అస్సలు సందేహం లేదు. అయితే, ధర పెరుగుతున్న కొద్దీ నాలో ఆందోళన మొదలైంది. మంచి జట్టును తీర్చిదిద్దుకోవాలంటే ముంబై డబ్బు వృథా చేయకుండా ఉండాలి. కానీ నా కోసం ఇతర జట్లు పోటీ పడటంతో ఒక్కసారిగా ధర పెరిగిపోయింది. ఆ సమయంలో నా గుండె జారినంత పనైంది’’ అని పేర్కొన్నాడు.

ఇక ముంబై తనను కొనుగోలు చేయడం వెనుక కారణం గురించి చెబుతూ... ‘‘వాళ్లకు నా గురించి, నా ఆట గురించి తెలుసు. నా ఫ్రాంఛైజీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేనూ ఆ కుటుంబంలో ఓ సభ్యుడినే. నాకు బయటకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. నాలుగేళ్లుగా ఈ జట్టులోని సభ్యులతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మేము ట్రోఫీలు గెలిచాం. ఒకరికోసం ఒకరం నిలబడ్డాం. అందుకే వేరే జట్టుకు వెళ్లాలంటే నా మనసు అంగీకరించదు. అదృష్టవశాత్తూ నా జట్టులోకి తిరిగి వచ్చేశాను’’ అని ఇషాన్‌ కిషన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 

చదవండి: IPL 2022 Auction: ముంబై ఇండియన్స్‌ జట్టును చూసేద్దాం..
IPL 2022: బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్న సురేశ్ రైనా 

మరిన్ని వార్తలు