IPL 2022 Auction: ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అరంగేట్రం!.. నా మొదటి ప్రాధాన్యం అదే!

13 Jan, 2022 13:05 IST|Sakshi
PC: Joe Root

IPL 2022 Auction- Joe Root Comments: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో స్టార్‌ ప్లేయర్లు ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటను బయటపెడుతున్నారు. ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఇప్పటికే మెగా ఈవెంట్‌లో పునరాగమనం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ సైతం ఈసారి తాను వేలంలో పాల్గొనే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చాడు. అయితే, దేశం కోసం ఆడటానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానన్న రూట్‌.. అన్నీ కుదిరితే తొలిసారిగా తాను ఐపీఎల్‌ ఆడే ఛాన్స్‌ ఉందన్నాడు. 

ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో రూట్‌ మాట్లాడుతూ... ‘‘ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. నా టెస్టు కెరీర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపదని నాకు అనిపించాలి. అప్పుడే.. వేలంలోకి వెళ్తాను. ఏదేమైనా ఇంగ్లండ్‌ కోసం ఆడటమే నాకు ముఖ్యం. ఈ టోర్నీ వల్ల టెస్టు క్రికెట్‌ నేను దూరం కానని భావించినపుడే అటువైపుగా అడుగులు వేయాలి. కేవలం నేను కాదు.. ప్రతి క్రికెటర్‌ ఇలాగే ఆలోచించాలి’’ అని రూట్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-15 ఎడిషన్‌లో భాగంగా రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో.. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై బీసీసీఐ తుది గడువు విధించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించగా విదేశీ ఆటగాళ్లు ఈ మేరకు స్పందించడం గమనార్హం.

కాగా స్టార్క్‌, జో రూట్‌ ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇక స్టార్క్‌ 2015లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించగా.. రూట్‌ ఇంతవరకు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడలేదు. 2011లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన అతడు... ఇప్పటి వరకు 83 మ్యాచ్‌లు ఆడాడు. 1994 పరుగులు సాధించాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక చివరిసారిగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 2019లో రూట్‌ టీ20 మ్యాచ్‌ ఆడాడు.

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు
IPL 2022: ముంబై, యూఏఈ కాదు.. ఈసారి దక్షిణాఫ్రికాలో ఐపీఎల్‌?!

మరిన్ని వార్తలు