IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! అప్పుడు అలా చేశాం కాబట్టే ఇలా!

16 Feb, 2022 11:34 IST|Sakshi
కేన్‌ రిచర్డ్‌సన్‌(PC: IPL)

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ మెగా వేలం-2022 కొందరు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తే మరికొందరికి నిరాశను మిగిల్చింది. బెంగళూరులో రెండు రోజుల పాటు సాగిన ఆక్షన్‌లో 10 ఫ్రాంఛైజీలు స్టార్‌ ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. అయితే, 217 స్థానాలకు క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉన్నా... 204 మందితోనే సరిపెట్టడం గమనార్హం. ఇక సురేశ్‌ రైనా, షకీబ్‌ అల్‌ హసన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, ఆరోన్ ఫించ్‌ తదితర పేరున్న పలువురు ఆటగాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఏ జట్టు కూడా వీరిని కొనేందుకు ఆసక్తికనబరచలేదు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ కూడా ఉన్నారు. గత సీజన్‌లో వీరిద్దరు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో.. తామిద్దరం అమ్ముడుపోకుండా మిగిలిపోవడంపై రిచర్డ్‌సన్‌ స్పందించాడు. ఈఎస్‌ఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘నిజంగా ఆడం జంపాను ఎవరూ కొనలేదంటే నేను విస్మయానికి గురయ్యాను. అయితే, నిజాయితీగా మాట్లాడుకుంటే... మేము గత సీజన్‌ మధ్యలోనే లీగ్‌ నుంచి వైదొలిగాము. ఈ విషయం గురించి తనతో సంభాషించే క్రమంలో... ‘‘ఇందుకు మనం కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని తనకు చెప్పాను. 

అయితే, ఆ సమయంలో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవడమే మాకు అ‍త్యంత ప్రాధాన్యమైనది. అందుకే వెళ్లిపోయాము. వేలం సమయంలో ఫ్రాంఛైజీలు మాపై ఆసక్తి చూపకపోవడానికి, మమ్మల్ని కొనుగోలు చేయకపోవడానికి ఇదొక కారణమని నేను భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల గత రెండు సీజన్లలో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయానని చెప్పుకొచ్చాడు. 

మెగా వేలం నేపథ్యంలోనూ  తాను ఏ ఫ్రాంఛైజీతోనూ సంప్రదింపులు జరుపలేదని రిచర్డ్‌సన్‌ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్‌ -2021 కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెకు కొందరు ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఆడం జంపా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్‌ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్‌

మరిన్ని వార్తలు