IPL 2022 Auction: వీరేమో దూరం.... వాళ్లకు భారీ డిమాండ్‌! ఈ ఇద్దరిపై అందరి దృష్టి!

12 Feb, 2022 08:37 IST|Sakshi

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ అంటేనే కాసుల వర్షం.... ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడాలని ప్రపంచంలోని ప్రతి క్రికెటర్‌ కోరుకుంటానడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగా వేలం వచ్చిందంటే కోట్లలో డబ్బు కొల్లగొట్టే అవకాశం. అయితే, కొంతమంది కీలక ఆటగాళ్లు ఈ సారి వేలానికి దూరమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు వేర్వేరు కారణాలతో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఆడరాదని నిర్ణయించుకున్నారు.

వీరిలో క్రిస్‌ గేల్, బెన్‌ స్టోక్స్, మిచెల్‌ స్టార్క్, కైల్‌ జేమీసన్, స్యామ్‌ కరన్, జాయ్‌ రిచర్డ్సన్, డాన్‌ క్రిస్టియాన్, క్రిస్‌ వోక్స్, మాట్‌ హెన్రీ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు.  

ఇక మెగా వేలంలో డిమాండ్‌ ఉన్న క్రికెటర్లు ఎవరంటే!
ఐపీఎల్‌లో గత రికార్డు, ప్రస్తుతం జట్ల అవసరాలు, భవిష్యత్తు... ఇలా అన్నీ చూస్తే వేలంలో కొందరు ఆటగాళ్లకు భారీ మొత్తం దక్కే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్, కెప్టెన్సీ అర్హతలు ఉన్న శ్రేయస్‌ అయ్యర్, వికెట్‌ కీపింగ్‌ హిట్టర్లు ఇషాన్‌ కిషన్, క్వింటన్‌ డి కాక్, టాప్‌ లెగ్‌ స్పిన్నర్‌ చహల్, ఫాస్ట్‌ బౌలర్‌ కగిసో రబడలకు మంచి డిమాండ్‌ ఉంది.

మిగతా భారత ఆటగాళ్లలో దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, ప్రసిధ్‌ కృష్ణ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం. ఇప్పటి వరకు టీమిండియాకు ఆడని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లలో భారీ షాట్లు ఆడే తమిళనాడు ప్లేయర్‌ షారుఖ్‌ ఖాన్, యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌లపై అందరి దృష్టీ ఉంది.

చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా!

మరిన్ని వార్తలు