IPL 2022 Auction: అప్పుడు ఆర్యన్‌తో కలిసి.. ఇప్పుడు ఇలా.. నా చిట్టితల్లిని చూస్తే గర్వంగా ఉంది: జూహీ చావ్లా భావోద్వేగం

18 Feb, 2022 13:00 IST|Sakshi

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కుమార్తె జాహ్నవి మెహతా తమ ఫ్రాంఛైజీ వ్యవహారాల్లో మమేకం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్‌ మెగా వేలం-2022 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు ఫ్రాంఛైజీలకు చెందిన కొత్త తరం నాయకులు పాల్గొన్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సీఈఓ కావ్య మారన్‌ సహా కేకేఆర్‌ యువ రక్తం జాహ్నవి, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ వారసులు ఆర్యన్‌ ఖాన్‌, సుహానా ఖాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా జాహ్నవి వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూహీ చావ్లా కూతురును ఉద్దేశించి భావోద్వేగ పోస్టు చేశారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలతో కూడిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘‘చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే ఐపీఎల్‌తో పాటు ఇతర క్రికెట్‌ ఈవెంట్లు చూడటం కూడా అలవాటుగా మార్చుకుంది. కామెంటేటర్ల వ్యాఖ్యలు శ్రద్ధగా వినేది. తనకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడు అనుకుంటా.. మేం సెలవుల కోసం బాలి వెళ్లినపుడు కాఫీ టేబుల్‌ మీద ఉన్న టెలిఫోన్‌ డైరెక్టరి సైజులో ఓ పుస్తకం... అందులో క్రికెటర్ల జీవిత చరిత్రలు, రికార్డులు, వారు సాధించిన విజయాలు.. ఇలా అన్నీ ఉన్నాయి.

ఆ బుక్‌ చదవడం పూర్తి చేయాలనే పిచ్చి పట్టింది తనకు. స్విమ్మింగ్‌ విరామ సమయంలో పూల్‌ ఒడ్డున కూర్చుని ఒక్క పేజీ కూడా వదలకుండా ఆ బుఖ్‌ చదివింది. ఇది చాలా అసహజమైన విషయం కదా! 12 ఏళ్ల పిల్ల ఇంతలా ఒక విషయం గురించి ఆలోచించడం! వయసు పెరిగే కొద్దీ తనలో క్రికెట్‌ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. క్రికెట్‌ గురించి మాట్లాడితే తన ముఖం మతాబులా వెలిగిపోతుంది. మూడేళ్ల క్రితం.. ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలిగా జాహ్నవి 17 ఏళ్ల వయసులో రికార్డు సాధించింది.

ఆర్యన్‌తో కలిసి జాహ్నవి వేలంలో పాల్గొంది. ఈసారి సుహానా కూడా వాళ్లతో చేరింది. దీనంతటికీ కారణమైన మా సీఈఓ వెంకీ మైసూర్‌కు ధన్యవాదాలు. జాహ్నవి అభిప్రాయాలకు విలువనిస్తూ... తనను ప్రోత్సహించారు. ఆమె అతడిని ఆప్యాయంగా ‘కోచ్‌’ అని పిలుస్తుంది. తన మనసంతా ఆట మీదే. ఒక తల్లిగా నా చిట్టితల్లిని చూసి గర్వపడుతున్నా. దేవుడి ఆశీర్వాదాలతో తన భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలి’’ అని అంటూ ఉద్వేగభరిత నోట్‌ రాశారు.  

చదవండి: IPL 2022- SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌...సైమన్‌ కటిచ్‌ రాజీనామా!?
ఐపీఎల్ 2022: గతేడాది మిస్‌ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్‌ పూర్తి జట్టు ఇదే..

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

మరిన్ని వార్తలు