IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్‌కోచ్‌

31 Jan, 2022 11:23 IST|Sakshi
photo courtesy: KKR Instagram

శుభ్‌మన్‌ గిల్‌... ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున 58 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్‌లో 478 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కానీ... ఐపీఎల్‌ మెగా వేలం-2022కు రిటెన్షన్‌ సమయంలో కేకేఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కెప్టెన్‌ కాగలడని భావించిన శుభ్‌మన్‌ గిల్‌ను వదిలేసుకుంది. 

ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు) , వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ గిల్‌ను సొంతం చేసుకుంది. వేలానికి ముందు ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేసుకునే క్రమంలో రూ. 8 కోట్లు వెచ్చించి ఈ టీమిండియా ఓపెనర్‌ను తమ జట్టులో చేర్చుకుంది. 

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ రిటెన్షన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభ గల యువ ఓపెనర్‌ గిల్‌ను దూరం చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ‘‘సునిల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ దశాద్దకాలంగా సేవలు అందిస్తున్నారు. వరుణ్‌ చక్రవర్తి సామర్థ్యమేమిటో గత రెండు సీజన్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక ఐపీఎల్‌ 2021 రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్‌ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి వీరే సాటి. 

తనదైన రోజున ఆండ్రీ రసెల్‌ ఎలాంటి అద్భుతాలు చేయగలడో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను వదిలేయాల్సి వచ్చింది. ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్‌ను కోల్పోవడం నిరాశ కలిగించింది. కొన్నిసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఏదేమైనా మెగా వేలానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని మెకల్లమ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచ‌ల‌నం సృష్టించిన జాసన్ హోల్డర్

>
మరిన్ని వార్తలు