IPL 2022 Auction: రాహుల్‌తో పాటు ఆసీస్‌ ఆటగాడు, రవి బిష్ణోయిని ఎంచుకున్న లక్నో.. అతడి​కి 15 కోట్లు!

25 Jan, 2022 11:04 IST|Sakshi

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌, భారత లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయిని తమ జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురి కోసం  లక్నో ఫ్రాంఛైజీ 30 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్‌ను మొదటి ఆప్షన్‌గా ఎంచుకున్న యాజమాన్యం అతడి కోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించగా... స్టొయినిస్‌ను 11 కోట్లు, రవి బిష్ణోయిని 4 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో పర్సులో 60 కోట్ల రూపాయలతో లక్నో మెగా వేలంలో పాల్గొననుంది. కాగా రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా వెంచర్స్‌ లిమిటెడ్‌ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. రాహుల్‌ ఆ టీమ్‌తో కొనసాగేందుకు ఇష్టపడక అందరికీ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు భారీ మొత్తంతో లక్నోకు సారథ్యం వహించేందుకు రాహుల్‌కు అవకాశం వచ్చింది. 

ఇదిలా ఉండగా... ఇప్పటి వరకు పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టొయినిస్‌కు అతని తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే భారీ మొత్తం దక్కినట్లే! ఇక భారత అండర్‌– 19 తరఫున సత్తా చాటడంతో పాటు రెండు ఐపీ ఎల్‌ సీజన్లలో కేవలం 6.95 ఎకానమీతో 24 వికెట్లు తీసిన బిష్ణోయ్‌కు ‘అన్‌క్యాప్డ్‌’ కారణంగా తక్కువ మొత్తానికే లక్నో దక్కించుకుంది. 

చదవండి: IPL 2022: ధోని ‘గుడ్‌ బై’.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!?

రాహుల్‌ ఆడిన 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు.  అత్యధిక స్కోరు 98 నాటౌట్‌. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పాండ్యా, రషీద్‌ కోసం రూ. 15 కోట్లు.. గిల్‌కు రూ. 7 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్‌ మెగా వేలం-2022 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్‌, కేకేఆర్‌ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం!
చదవండి: IPL Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!

మరిన్ని వార్తలు