IPL 2022 Auction- MS Dhoni: జడేజా కోసం కోట్లు వదులుకున్నాడు.. జట్టు కోసం ఏమైనా చేస్తాడు.. అతడే మా కెప్టెన్‌!

28 Jan, 2022 16:31 IST|Sakshi
PC: IPL

మిస్టర్‌ కూల్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడని గత కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజా కోసం తన స్థానాన్ని త్యాగం చేయడం... ఈ సీజన్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడనే వార్తల నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కెప్టెన్‌గా తన వారసత్వాన్ని కొనసాగించగల సామర్థ్యం జడేజాకే ఉందని భావించిన తలా... అతడికి పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు వదంతులు వ్యాపించాయి. ఇందుకోసం జట్టు యాజమాన్యంతో కూడా అతడు చర్చించినట్లు వార్తలు వినిపించాయి. 

అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాయి సీఎస్‌కే అధికార వర్గాలు. ఈ సీజన్‌లోనూ ధోనినే తమ కెప్టెన్‌ అని స్పష్టం చేశాయి. ఈ మేరకు వారు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అసలు కెప్టెన్సీ మార్పు గురించి చర్చ జరగనే లేదు. సమయం వచ్చినపుడు అన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోతాయి. ప్రస్తుతానికి ధోనియే మా సారథి. తను  సీఎస్‌కే ఆటగాడు. జట్టు కోసం ఎంతో చేశాడు. అతడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటాడు. ఈ విషయంలో ధోని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది.

ధోని అంచనాలకు అందనివాడు. జడేజా కోసం రిటెన్షన్‌లో తన ప్రాధాన్యాన్ని తగ్గించుకున్నాడు. సీఎస్‌కేకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుంటాడు. తను ఫిట్‌గా ఉన్నాడు. మాకు మరో టైటిల్‌ అందిస్తాడు.  ప్రస్తుతానికి మా అందరి దృష్టి మెగా వేలం మీదే ఉంది. ధోని కూడా ఈ విషయంలో సమాలోచనలు చేస్తున్నాడు’’ అని చెప్పుకొచ్చారు.

కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహణ నేపథ్యంలో ధోని ఇప్పటికే చెన్నైకి చేరుకున్నాడు. మేనేజ్‌మెంట్‌తో కలిసి ఆక్షన్‌ గురించి చర్చించనున్నాడు. ఇక రిటెన్షన్‌లో భాగంగా ధోని సలహా మేరకు సీఎస్‌కే 16 ​కోట్ల రూపాయాలు వెచ్చించి రవీంద్ర జడేజను మొదటి ప్లేయర్‌గా రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనికి 12 కోట్లు, మొయిన్‌ అలీకి 8 కోట్లు, రుతురాజ్‌ గైక్వాడ్‌కు 6 కోట్ల రూపాయలు పర్సు నుంచి ఖర్చు చేసింది.

చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్‌ ప్లేయర్లు... ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0!

మరిన్ని వార్తలు