IPL 2022- RCB Vs KKR: బెంగ తీర్చిన హసరంగ

31 Mar, 2022 05:04 IST|Sakshi

బెంగళూరు తొలి విజయం

3 వికెట్లతో కోల్‌కతాపై గెలుపు

హసరంగకు 4 వికెట్లు

129 పరుగుల విజయ లక్ష్యం అంటే పెద్ద కష్టమేమీ కాదు... ఆడుతూ, పాడుతూ ఛేదించవచ్చని అనిపిస్తుంది. కానీ దీనిని అందుకునేందుకు కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తీవ్రంగా శ్రమించింది. 7 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌ రెండో బంతికి గానీ లక్ష్యం చేరలేదు... ఆఖర్లో తడబడ్డా అదృష్టం ఆ జట్టు పక్షాన నిలిచింది.

అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) సాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. హసరంగ తన లెగ్‌ స్పిన్‌తో నైట్‌రైడర్స్‌ను కట్టి పడేయగా, హర్షల్‌ పటేల్‌ కూడా పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ముంబై: తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు మలి పోరులో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్‌ (18 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. వనిందు హసరంగ (4/20) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, ఆకాశ్‌దీప్‌ 3, హర్షల్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరు గులు చేసి గెలిచింది. రూథర్‌ఫర్డ్‌ (40 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

టపటపా...
గత మ్యాచ్‌లో చక్కటి విజయం సాధించిన కోల్‌కతా తర్వాతి మ్యాచ్‌కే పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్‌ నిలకడగా సాగలేదు. పవర్‌ప్లే ముగిసేసరికే వెంకటేశ్‌ అయ్యర్‌ (10), రహానే (9), నితీశ్‌ రాణా (10) పెవిలియన్‌ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్‌ అయ్యర్‌ (13) వెనుదిరిగాడు. తన తొలి ఓవర్లోనే శ్రేయస్‌ను అవుట్‌ చేసిన హసరంగ, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్‌ (12), షెల్డన్‌ జాక్సన్‌ (0) పని పట్టాడు. రసెల్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా, బిల్లింగ్స్‌ (14) కూడా విఫలం కావడం కేకేఆర్‌ను దెబ్బ తీసింది. చివర్లో ఉమేశ్‌ యాదవ్‌ (18) కొన్ని పరుగులు జోడించడంతో కనీస స్కోరు నమోదైంది. తన 4 ఓవర్లలో 2 మెయిడిన్‌లు వేసిన పేసర్‌ హర్షల్‌ పటేల్‌... ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా (సిరాజ్‌ తర్వాత– 2020లో కోల్‌కతాపైనే) నిలవడం విశేషం.  

తడబడుతూనే...
ఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్‌ కూడా గొప్పగా సాగలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా రావత్‌ (0), డుప్లెసిస్‌ (5), కోహ్లి (12) వెనుదిరిగారు. విల్లీ (18) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రూథర్‌ఫర్డ్‌ బాగా నెమ్మదిగా ఆడగా... షహబాజ్‌ అహ్మద్‌ (20 బంతుల్లో 27; 3 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ బెంగళూరుకు కాస్త ఊపు తెచ్చింది. చివర్లో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ పెరిగినా... దినేశ్‌ కార్తీక్‌ (14 నాటౌట్‌), హర్షల్‌ పటేల్‌ (10 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా మ్యాచ్‌ను ముగించారు.

స్కోరు వివరాలు  
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) షహబాజ్‌ (బి) సిరాజ్‌ 9; వెంకటేశ్‌ (సి అండ్‌ బి) ఆకాశ్‌దీప్‌ 10; శ్రేయస్‌ (సి) డుప్లెసిస్‌ (బి) హసరంగ 13; రాణా (సి) విల్లీ (బి) ఆకాశ్‌దీప్‌ 10; నరైన్‌ (సి) ఆకాశ్‌దీప్‌ (బి) హసరంగ 12; బిల్లింగ్స్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 14; జాక్సన్‌ (బి) హసరంగ 0; రసెల్‌ (సి) కార్తీక్‌ (బి) హర్షల్‌ 25; సౌతీ (సి) డుప్లెసిస్‌ (బి) హసరంగ 1; ఉమేశ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 18; వరుణ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 128. 
వికెట్ల పతనం: 1–14, 2–32, 3–44, 4–46, 5–67, 6–67, 7–83, 8–99, 9–101, 10–128.
బౌలింగ్‌: విల్లీ 2–0–7–0, సిరాజ్‌ 4–0–25–1, ఆకాశ్‌దీప్‌ 3.5–0–45–3, హసరంగ 4–0–20–4, హర్షల్‌ 4–2–11–2, షహబాజ్‌ 1–0–16–0.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) రహానే (బి) సౌతీ 5; రావత్‌ (సి) జాక్సన్‌ (బి) ఉమేశ్‌ 0; కోహ్లి (సి) జాక్సన్‌ (బి) ఉమేశ్‌ 12; విల్లీ (సి) రాణా (బి) నరైన్‌ 18; రూథర్‌ఫర్డ్‌ (సి) జాక్సన్‌ (బి) సౌతీ 28; షహబాజ్‌ (స్టంప్డ్‌) జాక్సన్‌ (బి) వరుణ్‌ 27; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 14; హసరంగ (సి) రసెల్‌ (బి) సౌతీ 4; హర్షల్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–1, 2–17, 3–17, 4–62, 5–101, 6–107, 7–111.
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–16–2, సౌతీ 4–0–20–3, రసెల్‌ 2.2–0–36–0, నరైన్‌ 4–0–12–1, వరుణ్‌ 4–0–33–1, వెంకటేశ్‌ 1–0–10–0.

ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

>
మరిన్ని వార్తలు