Brendon McCullum Rinku Singh: చాలా కాలం బెంచ్‌కే పరిమితం.. కానీ ఇప్పుడు సూపర్‌.. భవిష్యత్‌ తనదే: హెడ్‌ కోచ్‌

19 May, 2022 11:59 IST|Sakshi
కేకేఆర్‌ ప్లేయర్‌ రింకూ సింగ్‌(PC: IPL/BCCI)

IPL 2022 KKR Vs LSG- Rinku Singh: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు రింకూ సింగ్‌పై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైన సమయంలో తానున్నానంటూ భరోసానిచ్చే గొప్ప ఆట తీరు అతడి సొంతమని కొనియాడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనను తాను నిరూపించుకున్నాడని రింకూను.. మెకల్లమ్‌ ప్రశంసించాడు. 

కాగా ఐదేళ్లుగా కేకేఆర్‌తో ఉన్న రింకూ ఐపీఎల్‌-2022లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 174 పరుగులు సాధించాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో విజయతీరాలకు చేర్చి సత్తా చాటాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో కీలకమైన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ రింకూ ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం.

బుధవారం(మే 18) నాటి మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. కానీ రెండు పరుగుల తేడాతో ఓడి కేకేఆర్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతడి వీరోచిత పోరాటం వృథాగా పోయింది.

అయితే, మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడంటూ రింకూపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ హెడ్‌కోచ్‌ మెకల్లమ్‌ మాట్లాడుతూ.. ‘‘రింకూ సింగ్‌పై కేకేఆర్‌ ఫ్రాంఛైజీ నమ్మకం ఉంచింది. రానున్న కాలంలో అతడు కీలక సభ్యుడిగా ఎదిగే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో రాణిస్తూనే ఒంటిచేత్తో జట్టును గెలిపించగల కొంతమంది ఆటగాళ్లలో రింకూ ఒకడు. 

తన ఆట తీరు అద్బుతం. ఐదేళ్లుగా ఐపీఎల్‌లో భాగమయ్యాడు. చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ అవకాశం వచ్చినపుడు విజృంభించాడు. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొట్టాడు. సరైన సమయంలో తానేంటో నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణిస్తాడు’’ అని రింకూను కొనియాడాడు. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ 66: లక్నో వర్సెస్‌ కేకేఆర్‌ స్కోర్లు
లక్నో- 210/0 (20)
కేకేఆర్‌- 208/8 (20)

చదవండి👉🏾Shreyas Iyer: ఐపీఎల్‌-2022.. కేకేఆర్‌ అవుట్‌.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్‌

A post shared by Kolkata Knight Riders (@kkriders)

Poll
Loading...
మరిన్ని వార్తలు