IPL 2022: రిషభ్‌ భయ్యా చాలా మంచోడు.. గెలిస్తే క్రెడిట్‌ మాకు! ఒత్తిడి మాత్రం..

5 May, 2022 16:04 IST|Sakshi

ఒత్తిడిని భరించి మమ్మల్ని ప్రోత్సహిస్తాడు: చేతన్‌ సకారియా

IPL 2022 DC Vs SRH: ‘‘రిషభ్‌ భయ్యా.. చాలా కామ్‌గా ఉంటాడు. ఒత్తిడినంతా తానే భరిస్తాడు. జట్టు బాధ్యతను తీసుకుంటాడు. ఎప్పుడైనా మేము ఒత్తిడిలో కూరుకుపోతే దానిని అధిగమించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. మేము బాగా ఆడితే క్రెడిట్‌ అంతా మాకే ఇస్తాడు. అయితే, జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రం తానే ముందుంటాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ బౌలర్‌ చేతన్‌ సకారియా.. తమ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. 

తమకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నీ తానై వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 మినీ వేలంలో భాగంగా 20 లక్షల రూపాయల కనీస ధరతో ఆక్షన్‌లోకి రాగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా 1.2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. 

ఇక మెగా వేలం-2022 నేపథ్యంలో సకారియాను వదిలేయగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని సొంతం చేసుకుంది. అతడి కోసం 4. 20 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే, ఈ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఈ లెఫ్టార్మ్‌ సీమర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరులో జట్టులోకి వచ్చాడు.

ఆరోన్‌ ఫించ్‌ వికెట్‌ తీసి సత్తా చాటాడు. ఇక కొత్త ఫ్రాంఛైజీతో తన అనుబంధం పట్ల స్పందిస్తూ తాజాగా ఎన్డీటీవీతో ముచ్చటించిన సకారియా కోచ్‌ రిక్కీ పాంటింగ్‌, కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘రిక్కీ పాంటింగ్‌ ఆలోచనా విధానం నన్ను ఆకట్టుకుంది. క్లిష్ట సమయాల్లో ఆయన మాలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేయని ప్రయత్నం ఉండదు. సరదాగా మాట్లాడుతూ.. జోకులు వేస్తూ ఆటగాళ్లతో కలిసిపోతారు. ఒక్కో ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు.

అందుకు తగ్గట్లుగా మెళకువలు నేర్పుతారు’’ అని పాంటింగ్‌ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఇక కెప్టెన్‌గా పంత్‌ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడంటూ ప్రశంసించాడు. కాగా ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. గురువారం(మే 5) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో సాఫీగా దూసుకుపోవాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’

మరిన్ని వార్తలు