IPL 2022 CSK Vs DC: ప్లేఆఫ్‌ చేరడం కష్టమే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచిన సీఎస్‌కే

9 May, 2022 07:31 IST|Sakshi

ముంబై: ఇది వరకే ప్లేఆఫ్స్‌కు దూరమైన చెన్నై సూపర్‌కింగ్స్‌... రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టింది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ధోని సేన 91 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై నెగ్గింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లలో కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (33 బంతు ల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 11 ఓవర్లలో 110 పరుగులు జోడించారు. శివమ్‌ దూబే (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ ధోని (8 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా పరుగులు చేయడంతో చెన్నై 200 పైచిలుకు పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఖలీల్‌ 2 వికెట్లు తీశారు.  

తల్ల‘ఢిల్లీ’ది... 
భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ ప్రత్యర్థి పేస్, స్పిన్‌కు కుప్పకూలింది. 17.4 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కోన శ్రీకర్‌ భరత్‌ (8) రెండు ఫోర్లు కొట్టి నిష్క్రమించాడు. వార్నర్‌ (12 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్ష్‌ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌), పంత్‌ (11 బంతుల్లో 21; 4 ఫోర్లు) విఫలమయ్యారు.

పేస్, స్పిన్‌ ఉచ్చులో విలవిలలాడిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్కరూ కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు. 10వ ఓవర్‌ వేసిన మొయిన్‌ అలీ (3/13), 11వ ఓవర్‌ వేసిన ముకేశ్‌ చౌదరీ (2/22) రెండేసి చొప్పున 4 వికెట్లు తీయడంతోనే ఢిల్లీ కథ ముగిసింది. పావెల్‌ (3), రిపాల్‌ (6),  అక్షర్‌ పటేల్‌ (1) బ్యాట్లెత్తేశారు. సిమర్జీత్, బ్రేవోలు కూడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

>
Poll
Loading...
మరిన్ని వార్తలు