IPL 2022: ధర 30 లక్షలు.. ఇంతకీ సూయశ్‌ ఎవరు? అతడి ప్రత్యేకత ఏమిటి?

13 Apr, 2022 12:24 IST|Sakshi
సూయశ్‌ ప్రభుదేశాయి(PC: IPL/BCCI)

ఐపీఎల్‌ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాయల్‌ చెలెంజర్స్‌ యువ ఆటగాడు సూయశ్‌ ప్రభుదేశాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్‌ ప్లేయర్‌ మొయిన్‌ అలీ రనౌట్‌లో కీలక పాత్ర పోషించిన సూయశ్‌.. బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 34 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆగమనంలోనే తనదైన ముద్ర వేశాడు.

కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ ద్వారా సూయశ్‌ రూపంలో మరో కొత్త టాలెంట్‌ మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర అంశాలు!

దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సూయశ్‌
సూయశ్‌ 1997 డిసెంబరు 6న జన్మించాడు. 
గోవా తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న కుడిచేతి వాటం గల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ 2016లో లిస్ట్‌ ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 
2016-17 సీజన్‌లో బెంగాల్‌తో మ్యాచ్‌తో విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీతో అరంగేట్రం చేశాడు. 
2018-19 రంజీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి సూయశ్‌ ఎంట్రీ ఇచ్చాడు.
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఒక సెంచరీ, 8 అర్ధ శతకాలు సాధించడంతో పాటుగా ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.

టీ20 ఫార్మాట్‌లోనూ..
సూయశ్‌ 2018-9 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా సిక్కింతో మ్యాచ్‌లో  తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 23 బంతుల్లో 35 పరుగులు సాధించి గోవాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు సూయశ్‌.
అదే విధంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 200 స్ట్రైకు రేటుతో 48 పరుగులు సాధించి అజేయంగా నిలిచి సత్తా చాటాడు.
అంతేగాక తమిళనాడుపై గోవా విజయంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు.
దేశీ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్‌ ఆడిన సూయశ్‌ 443 పరుగులు సాధించాడు.

గోవా తరఫున నాలుగో ఆటగాడు..
ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన సూయశ్‌ ఐపీఎల్‌ మెగా వేలం-2022లోకి రాగా ఆర్సీబీ 30 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది.
సీఎస్‌కేతో మ్యాచ్‌లో హర్షల్‌ పటేల్‌ దూరమైన నేపథ్యంలో సూయశ్ ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 
గోవా తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న నాలుగో ఆటగాడు సూయశ్‌. అతడి కంటే ముందు స్వప్నిల్‌ అసోంద్కర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌), షాదాబ్‌ జకాటి(సీఎస్‌కే, ఆర్సీబీ, గుజరాత్‌ లయన్స్‌), సౌరభ్‌ బండేద్కర్‌(ఆర్సీబీ) క్యాష్‌ రిచ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

చదవండి: IPL 2022 CSK Vs RCB: సోదరి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం!

మరిన్ని వార్తలు