DC Vs PBKS: మెదడు పనిచేస్తుందా అసలు? లాటరీ ప్రకారం అవార్డు ఇస్తున్నారా?

21 Apr, 2022 14:42 IST|Sakshi
కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌(PC: IPL/BCCI)

ఐపీఎల్‌ నిర్వాహకుల తీరును ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

IPL 2022 DC Vs PBKS: ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై బుధవారం నాటి విజయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముస్తాఫిజుర్‌ పంజాబ్‌ కెప్టెన్‌ మాయంక్‌ అగర్వాల్‌ను పెవిలియన్‌కు పంపగా.. అక్షర్‌ పటేల్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ వికెట్‌ తీసి ఢిల్లీకి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. అంతేకాదు.. పంజాబ్‌ టాప్‌ స్కోరర్‌ జితేశ్‌ శర్మ వికెట్‌ను కూడా అక్షర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇద్దరు కీలక బ్యాటర్లను అవుట్‌ చేసి పంజాబ్‌ను చావుదెబ్బ కొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న అక్షర్‌ పటేల్‌ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మరోవైపు కుల్దీప్‌ యాదవ్‌.. 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కగిసో రబడ, నాథన్‌ ఎల్లిస్‌లను పెవిలియన్‌కు పంపి.. పంజాబ్‌ను 115 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో తన వంతు సాయం అందించాడు.

ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ఓపెనర్లు పృథ్వీ షా(20 బంతుల్లో 41 పరుగులు), డేవిడ్ వార్నర్‌(30 బంతుల్లో 60 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చారు. అంతాబాగానే ఉన్నా ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కుల్దీప్‌ యాదవ్‌కు ఇవ్వడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్లు కూల్చి పంజాబ్‌ను దెబ్బతీసిన అక్షర్‌కి కాకుండా.. కుల్దీప్‌నకు అవార్డు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

‘‘చెత్త అంపైరింగ్‌తో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఇలా! అసలు కుల్దీప్‌ ఈ అవార్డుకు ఏవిధంగా అర్హుడు. అక్షర్‌ పటేల్‌ను కాదని.. అతడికి ఎలా ఇస్తారు? మెదడు పనిచేస్తుందా అసలు? నిజంగా ఇదో పెద్ద జోక్‌. లాటరీ సిస్టమ్‌ ఏమైనా పెట్టారా? లేదంటే పేరును తప్పుగా ప్రకటించారా? ఎకానమీ రేటు కనిపించడం లేదా? ఏ ప్రాతిపదికన అవార్డు ఇచ్చారు’’ అంటూ నిర్వాహకులపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. 

కాగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అక్షర్‌ పటేల్‌ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. మిడిల్‌ ఓవర్లలో చక్కగా బౌలింగ్‌ చేశాడని, అతడితో అవార్డు పంచుకుంటానని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్‌ రెండు, కుల్దీప్‌ రెండు, లలిత్‌ యాదవ్‌ రెండు, ఖలీల్‌ అహ్మద్‌ రెండు, ముస్తాఫిజుర్‌ ఒక వికెట్‌ తీసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
పంజాబ్‌-115 (20)
ఢిల్లీ- 119/1 (10.3)

చదవండి: ఫ్రీగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్‌ లింకును దొంగిలించి..!

మరిన్ని వార్తలు