IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ, పంజాబ్‌ మధ్య బిగ్‌ ఫైట్‌.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..!

16 May, 2022 11:12 IST|Sakshi
Photo Courtesy: IPL

DC VS PBKS Predicted Playing XI: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 16) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ, పంజాబ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న (మే 15) రాజస్థాన్‌ చేతిలో లక్నో ఓడిపోవడంతో.. ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన మూడు స్దానాల కోసం ఆరు జట్ల (రాజస్థాన్‌, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ, కేకేఆర్‌, పంజాబ్‌) మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. 

ఇక నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. పంజాబ్‌, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో చెరి 12 పాయింట్లు (12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో సమంగా ఉన్నాయి. అయితే పంజాబ్‌ (0.023)తో పోలిస్తే.. ఢిల్లీ (0.210) నెట్‌ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు ఐదో స్థానంలో, పంజాబ్‌ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ​ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.

తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. 
గత కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడ్డ ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. అతను ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా తెలుస్తోంది. ఇదే జరిగితే కేఎస్ భరత్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచిన జట్టునే డీసీ యధాతథంగా కొనసాగించవచ్చు. పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ కోసం మయాంక్‌ సేన ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. గత మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలిచిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్‌ ఉంది. 

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. నేటి మ్యాచ్‌లో రెండు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన బెయిర్‌ స్టో, లివింగ్‌స్టోన్‌ భీకరమైన ఫామ్‌లో ఉండగా.. బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్‌, రిషి ధవన్‌లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఢిల్లీ విషయానికొస్తే.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌లు రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే పంజాబ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక పృథ్వీ షా, రిషబ్‌ పంత్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్‌ కూడా రాణిస్తే.. ఢిల్లీని ఆపడం చాలా కష్టమవుతుంది. 

తుది జట్లు (అంచనా)..
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసొ రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. 

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్‌ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా.
చదవండి: లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్‌.. ప్లే ఆఫ్స్‌ దిశగా అడుగు

మరిన్ని వార్తలు