DC Vs RR No Ball Controversy: ఏంటి పంత్‌ ఇది.. మరీ ఇంతలా.. చెత్త ప్రవర్తన: మాజీల విమర్శల వర్షం

23 Apr, 2022 11:49 IST|Sakshi
తమ ఆటగాళ్లను వెనక్కి పిలుస్తున్న పంత్‌(PC: IPL/Disney+Hotstar)

IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు.

ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్‌, అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో రాజుకున్న నో- బాల్‌ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది.

అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్‌ పంత్‌, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.

‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్‌మెన్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్‌ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ సైతం ఇదే తరహాలో స్పందించాడు. 

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు.

ఇక ఇంగ్లండ్‌ మాజీ సారథి, ఐపీఎల్‌ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ పంత్‌ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్‌.. ఫుట్‌బాల్‌ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్‌ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు.

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ సైతం.. ‘‘పంత్‌ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్‌ పంత్‌’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్‌లో నాలుగో పరాజయం నమోదు చేసింది.

చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సింది: పంత్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు