Rovman Powell: ఆ రికార్డు బద్దలు కొట్టాలి! 130 మీటర్లు.. నా లక్ష్యం అదే!

6 May, 2022 14:54 IST|Sakshi
రోవ్‌మన్‌ పావెల్‌(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs SRH: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లు- స్కోరు 67 నాటౌట్‌. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ నమోదు చేసిన గణాంకాలు ఇవి. ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెస్టిండీస్‌ క్రికెటర్‌ పావెల్‌.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత ఢిల్లీ విజయాల్లో భాగమవుతూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఇక గురువారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విలువైన ఇ‍న్నింగ్స్‌ ఆడాడు పావెల్‌.

ముఖ్యంగా ఆఖరి ఓవర్‌లో రైజర్స్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో ఈ హిట్టర్‌ ఒక సిక్సర్‌తో పాటు మూడు ఫోర్లు బాది సత్తా చాటాడు. ముఖ్యంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన బంతిని సమర్థవంతగా ఎదుర్కొని బౌండరీ బాదిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక 102 మీటర్ల సిక్సర్‌ చూసి ఢిల్లీ ఫ్యాన్స్‌ మురిసిపోయారు.

ఇక తన మెరుపు ఇన్నింగ్స్‌ గురించి విజయానంతరం స్పందించిన పావెల్‌ సిక్సర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 130 మీటర్ల భారీ సిక్సర్‌ కొడతానని ఊహించానని, అయితే ఇప్పుడు కాకపోయినా తదుపరి మ్యాచ్‌లోనైనా ఈ ఫీట్‌ నమోదు చేస్తానని పేర్కొన్నాడు. 

కాగా ఐపీఎల్‌ చరిత్రలో.. బిగ్గెస్ట్‌ సిక్స్‌ ఆల్బీ మోర్కెల్‌(125 మీటర్లు- 2008లో) పేరిట ఉంది. ఇక ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 117 మీటర్ల సిక్సర్‌ బాదాడు. వీరిద్దరిని అధిగమించి 130 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాలని భావిస్తున్నట్లు పావెల్‌ పేర్కొనడం విశేషం. 

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘నిన్న నేను 130 మీటర్ల సిక్సర్‌ కొడతాననే అనుకున్నా. మన్‌దీప్‌తో ఈ విషయం చెప్పాను. చూద్దాం ఏ జరుగుతుందో!’’ అని వ్యాఖ్యానించాడు. కాగా డేవిడ్‌ వార్నర్‌(92- నాటౌట్‌), పావెల్‌(67- నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు చేసిన ఢిల్లీ 21 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. 
చదవండి👉🏾 David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్‌ కదూ!

మరిన్ని వార్తలు